ఎన్నికల నిర్వహణలో జాప్యం.. భారత పారాలింపిక్స్ కమిటీపై సస్పెన్షన్ వేటు

ఎన్నికల నిర్వహణలో జాప్యం.. భారత పారాలింపిక్స్ కమిటీపై సస్పెన్షన్ వేటు

సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవ్వడంతో భారత పారాలింపిక్ కమిటీ(పీసీఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటు వేసింది. భారత పారాలింపిక్ కమిటీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రిత్వ శాఖ సూచించిన స్పోర్ట్ కోడ్‌ను ఉల్లంఘిస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి పీసీఐ ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

2019లో చివరిసారి ఎన్నికలు జరగ్గా.. నాలుగేళ్ల పదవీకాలం జనవరి 31, 2024తో ముగిసింది. ఆ పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందు ఎన్నికలు నిర్వహించాలి. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి. అయితే, అలా జరగలేదు. మార్చి 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జనవరి 22న పీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం.. పాత ఎగ్జిక్యూటివీ కమిటీ పదవీకాలం ముగిసిన రెండు నెలల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. 

క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పరిధిలోని ఏదేని సమాఖ్యకు కొత్త ఆఫీస్ బేరర్ల కోసం కొనసాగుతున్న కమిటీ గడువు ముగియడానికి నెల రోజుల ముందు ఎన్నికలు నిర్వహించాలి. అలా జరగక పోగా గడువు తేదీ తెలిసినప్పటికీ, మార్చిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రస్తుత కమిటీ నిర్ణయం ఉద్దేశపూర్వకంగా ఉన్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పీసీఐని తక్షణమే సస్పెండ్ చేయడం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని వెల్లడించింది. పీసీఐ రోజువారి కార్యకలాపాల పర్యవేక్షణకు అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా‌ను ఆదేశించింది.