స్పౌజ్ టీచర్ల బదిలీలపై సప్పుడులేదు

స్పౌజ్ టీచర్ల బదిలీలపై సప్పుడులేదు
  • అనేకసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలే
  • తీవ్ర ఆందోళనలో స్పౌజ్ టీచర్లు    

హైదరాబాద్, వెలుగు : ‘‘టీచర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలను ఒకేచోటికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చినం. జీవోలు ఇచ్చినం. భార్య ఉన్నచోటికి భర్తను గానీ, భర్త ఉన్న చోటికి భార్యను గానీ బదిలీ చేస్తాం. 99.99% స్పౌజ్ కేసులు ఒకే చోటికి తెస్తరు. ఎక్కడైనా ఒకే ఊరిలో, టౌన్ లో గానీ, మండలంలో వేసే పరిస్థితి లేకపోతే పక్కపక్కనైనా వేయాలని చెప్పినం”... ఇవీ 2018 మే16న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. కానీ నాలుగేండ్లు దాటినా సీఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. దీనికితోడు తాజాగా సర్కారు తెచ్చిన జీవో 317తో మరి కొంతమంది టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిర్వహించి, 13 జిల్లాల్లో బ్లాక్ చేశారు. దీంతో ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న స్పౌజ్ టీచర్లు నిత్యం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.  

కావాలనే ఆ 13 జిల్లాలు బ్లాక్?

కొత్త జిల్లాలకు అనుగుణంగా కేడర్ కేటాయింపు కోసం ప్రభుత్వం గతేడాది డిసెంబర్​లో జీవో 317 తెచ్చింది. సీనియార్టీ ఆధారంగా టీచర్లను జిల్లాలకు కేటాయించారు.  హైదరాబాద్ మినహా మి గిలిన 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ జరిగింది. దీంతో చాలామంది సొంత జిల్లాలకు దూరం కాగా, వంద లాది మంది భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు అలాటయ్యారు. టీచర్లు, ఎంప్లాయీస్ భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేందుకు వీలుగా సర్కారు ఓ మెమో రిలీజ్ చేసింది. దీనికనుగుణంగా19 జిల్లాల్లో 2,400 స్పౌజ్ బదిలీలు చేపట్టారు. వివిధ కారణాలతో మరో13 జిల్లాల్లో బదిలీలు చేయకుండా బ్లాక్ చేసింది. బ్లాక్ అయిన వాటిలో గ్రేటర్ హైదరా బాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లా లే ఉండటంతో వాటిలో బదిలీలకు సర్కారు ససేమి రా అంటున్నది. రిక్రూట్మెంట్ కు ఇబ్బందులు వస్తాయనే ఆ13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టే ఆలోచన సీఎంకు లేదని టీచర్ల సంఘాల లీడర్లకు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్తున్నారు.  

ఖాళీలున్నా బదిలీలు చేయట్లే

స్పౌజ్ బదిలీలకు బ్లాక్ చేసిన13 జిల్లాల్లో మొత్తం 2,566 అప్లికేషన్లు వచ్చాయి. రివర్స్ స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు, పరస్పర బదిలీలకు అవకాశమివ్వడంతో కొంతమంది లక్షలు ఖర్చు చేసి బదిలీ అయ్యారు. ఇంకా 2 వేలకు పైగా అప్పీల్స్ ఉన్నాయని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు చెప్తున్నారు. టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్​కు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో పక్కన పెట్టినట్టు ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ, చాలామంది పైరవీలతో ఆయా జిల్లాల్లోకి పోస్టింగ్​లు ఇప్పించుకున్నారు. మరోపక్క ఆయా జిల్లాల్లో మొత్తం 6,653 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 2032 అప్పీల్స్ మాత్రమే పెండింగ్​లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేసినా 4,994 టీచర్ పోస్టులు ఖాళీగానే ఉంటాయని అంటున్నారు.