డిస్ ఇన్ఫెక్టెంట్లు డేంజరే..

డిస్ ఇన్ఫెక్టెంట్లు డేంజరే..
  • వ్యక్తులపై స్ప్రే చేస్తే ఫిజికల్, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న కేంద్రం

న్యూఢిల్లీ: వ్యక్తులపై డిస్ ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఫిజికల్ గా, సైకలాజికల్ గా హాని కలిగిస్తుందని హెచ్చరించింది. కరోనా సోకిన వ్యక్తిపై డిస్ ఇన్ఫెక్టెంట్ చల్లినా వైరస్ చావదని చెప్పింది. సోడియం హైపోక్లోరైట్ ను వ్యక్తులపై స్ప్రే చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చాలా మంది నుంచి ప్రశ్నలు వచ్చాయని అందుకే ఈ అడ్వైజరీ ఇస్తున్నట్లు పేర్కొంది. డిస్ ఇన్ఫెక్టెంట్లు వ్యాధి కలిగించే, హానికరమైన సూక్ష్మజీవులను మాత్రమే నాశనం చేస్తాయని తెలిపింది. మనం తరచూ వెళ్లే ప్రాంతాలు, ముట్టుకునే ఉపరితలాలను క్లీన్ చేసేందుకు మాత్రమే ఉపయోగించాలని సూచించింది. హ్యాండ్ గ్లౌస్ లు లాంటి వస్తువులను డిస్ ఇన్ఫెక్టెంట్లతో క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తులపై స్ప్రే చేయరాదని చెప్పింది. వ్యక్తులపై క్లోరిన్ చల్లటం వల్ల కళ్లు, చర్మంపై మంటలు, వికారం, వాంతి లాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపింది. సోడియం హైపోక్లోరైట్ ను పీల్చడం వల్ల ముక్కు, గొంతులో మంట పుడుతుందని, ఊపిరి సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పింది.