
- 2 నెలల్లో నాలుగో కేసు నమోదు.. ఇప్పటికే ముగ్గురు పిల్లలు మృతి
కోజికోడ్: కేరళలో మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుండటం కలవరం సృష్టిస్తోంది. రెండు నెలల్లోనే నలుగురు పిల్లలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా బారిన పడగా.. వీరిలో ఇప్పటికే ముగ్గురు పిల్లలు మృతిచెందారని.. నాలుగో పిల్లాడు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. కోజికోడ్ జిల్లాలోని పయ్యోలికి చెందిన 14 ఏండ్ల పిల్లాడికి తాజాగా ఈ నెల 1న ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిందని, అయితే వెంటనే వ్యాధిని గుర్తించి తాము ట్రీట్ మెంట్ ప్రారంభించడంతో అతడి పరిస్థితి మెరుగవుతోందని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.
అతివేగంగా విదేశాల నుంచి మందులు తెప్పించి వాడినందుకే పిల్లాడు కోలుకుంటున్నాడని చెప్పారు. కాగా, రాష్ట్రంలోని కన్నూర్ లో మే 21న 5 ఏండ్ల పిల్లాడు, మలప్పురంలో జూన్ 25న 13 ఏండ్ల బాలిక, జులై 3న 14 ఏండ్ల పిల్లాడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయారు. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ శుక్రవారం ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఈ వ్యాధిపై ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. మెదడును తినే అమీబా ప్రధానంగా మురికి నీళ్ల ద్వారానే మనుషులకు వ్యాపిస్తోందని, దీనివల్ల పిల్లలకే ఎక్కువ ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మురికి నీళ్లు ఉండే కుంటలు, చెరువుల్లో స్నానం చేయొద్దని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్ ను, నీళ్లు నిల్వ ఉండే ఇతర ప్రాంతాల్లో క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. కాగా, నేగ్లేరియా ఫోలెరీ అనే అమీబా వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింజోఎన్ సెఫలైటిస్ (నేగ్లేరియాసిస్) అని పిలుస్తారు. వేడిగా, మురికిగా ఉండే నీళ్లలో ఈ అమీబా స్వేచ్ఛగా జీవిస్తుంది. మనుషుల ముక్కు ద్వారా ఇది మెదడుకు చేరి బ్రెయిన్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. ప్రధానంగా పిల్లలకు ఇది ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు.