రంగుల పండుగ స్పెషల్

 రంగుల పండుగ స్పెషల్

వసంతకాలం వచ్చి, పది రోజులు దాటింది. త్వరలోనే హోలీ పండుగ కూడా రాబోతుంది. రంగులు చల్లుకుంటూ.. ఆ తెల్ల బట్టలు హరివిల్లు రంగులు పులుముకునే వరకు పండుగ చేసుకుంటారు.హోలీ ఆడటం ఓకే.. మరి ఈసారి హోలీ రోజున స్పెషల్​గా తినడానికి ఏ వంటలు చేయాలి? 
అని ఆలోచిస్తుంటే కనుక ఇవి మీకోసం. 

ఠండాయ్

కావాల్సినవి :ఐస్​ క్యూబ్స్​ – మూడు
పాలు – పావు లీటర్
ఠండాయ్​ పౌడర్ కోసం :
జీడిపప్పు, బాదం, చక్కెర  – ఒక్కోటి పావు కప్పు చొప్పున
గసగసాలు, పుచ్చకాయ విత్తనాలు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్​ల చొప్పున, సోంఫు, మిరియాలు – ఒక్కోటి  ఒక్కో టీ స్పూన్​ చొప్పున
యాలకులు – మూడు
ఎండిన గులాబీ రేకులు – కొన్ని తయారీ :

మిక్సీ జార్​లో జీడిపప్పు, బాదం, చక్కెర, గసగసాలు, పుచ్చకాయ విత్తనాలు, సోంఫు, మిరియాలు, యాలకులు, ఎండిన గులాబీ రేకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గ్లాస్​లో ఐస్​ క్యూబ్స్​ వేసి, తయారుచేసిపెట్టుకున్న ఠండాయ్ పౌడర్​ని కూడా మూడు స్పూన్​లు వేయాలి. అందులో కాచి, చల్లార్చిన పాలుపోసి, స్పూన్​తో బాగా కలపాలి. చివరిగా కుంకుమ పువ్వు, గులాబీ రేకుల్ని పైన చల్లాలి. కూల్​ కూల్​గా తాగేందుకు హెల్దీ ఠండాయ్ రెడీ. ​ 

ఠండాయ్ చాకొలెట్

కావాల్సినవి :
వైట్ చాకొలెట్ – పావు కిలో
కండెన్స్​డ్ మిల్క్ – ఒక కప్పు
ఠండాయ్ పౌడర్ – ఒక టీ స్పూన్​
పిస్తా తరుగు – ఒక కప్పు
ఉప్పు – చిటికెడు 
తయారీ : 
ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి, ఆ నీటిలో కండెన్స్​డ్ మిల్క్​ ఉన్న గిన్నెను పెట్టాలి. కండెన్స్​డ్ మిల్క్ వేడయ్యాక, అందులో వైట్ చాకొలెట్​ తరుగు వేసి ఐదు నిమిషాలు కరిగించాలి. చాకొలెట్ కరిగాక, గిన్నెను స్టవ్​ మీద నుంచి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఠండాయ్ పౌడర్​​, పిస్తా తరుగు వేసి బాగా కలపాలి. వెన్న రాసిన గిన్నెలోకి తీసుకుని, పైన పిస్తా తరుగు, గులాబీ రేకులు, ఉప్పు చల్లి, ఐదు గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్​ చేసుకుని తినేయడమే.
బచ్కా

కావాల్సినవి:
బియ్యప్పిండి – ఒక కప్పు 
శనగపిండి – అరకప్పు
వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక్కోటి ఒక టీ స్పూన్ చొప్పున​
ఉప్పు, నీళ్లు – సరిపడా
కారం – అర టీ స్పూన్​
పచ్చి శనగపప్పు (నానబెట్టిన) – 
ఒక కప్పు, నూనె – వేగించడానికి సరిపడా
తయారీ :
ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ బజ్జీ పిండిలా జారుగా కలపాలి. అందులో పచ్చి శనగపప్పు వేసి కలపాలి. ఒక పాన్​లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. దానిమీద పిండి కలిపిపెట్టిన చిన్న దోశల్లా పోయాలి. రెండు వైపులా బాగా కాల్చితే కరకరలాడే బచ్కాలు రెడీ. 

మట్కా మలై కుల్ఫీ

కావాల్సినవి :
పాలు – మూడు కప్పులు
క్రీమ్ – ఒక కప్పు
మిల్క్​పౌడర్, బాదం, పిస్తా, జీడిపప్పు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్​ల చొప్పున
కుంకుమ పువ్వు – పావు టీ స్పూన్
చక్కెర – పావు కప్పు
తయారీ :
ఒక పాన్​లో పాలు, క్రీమ్, మిల్క్​ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కాగబెట్టాలి. ఉండలు కట్టకుండా తిప్పాలి. పాల మిశ్రమం కాగాక బాదం, పిస్తా, జీడిపప్పు వేసి పది నిమిషాలు కాగబెట్టాలి. పాలు దగ్గర పడ్డాక చక్కెర వేసి మరో ఐదు నిమిషాలు కాగబెట్టాలి. క్రీమ్​లాగ అయ్యాక మట్టి (మట్కా) కుండల్లో లేదా గ్లాసులో పోసి, పాలిథీన్ కవర్​తో గాలి చొరబడకుండా మూసేయాలి. ఆ కుండల్ని దాదాపు ఎనిమిది గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత కవర్​ తీసేసి, పైన నట్స్​ చల్లుకుని చల్లగా, తియ్యగా ఉండే కుల్ఫీని ఎంజాయ్​ చేయొచ్చు. 

నాన్ ఖటాయ్ 
కావాల్సినవి : 
నెయ్యి, మైదా – ఒక కప్పు
చక్కెర పొడి – ముప్పావు కప్పు
బొంబాయి రవ్వ, శనగపిండి – రెండు టేబుల్ స్పూన్​లు
బేకింగ్ పౌడర్, యాలకుల పొడి – అర టీ స్పూన్​
ఉప్పు – సరిపడా 
పిస్తా – కొన్ని
తయారీ :
ఒక గిన్నెలో నెయ్యి, చక్కెర పొడి బాగా కలపాలి. అందులో జల్లెడ పట్టిన మైదా, బొంబాయి రవ్వ,  శనగపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఒక ప్లేట్​లో పెట్టాలి. వాటిపైన పాలతో తడి చేసి, పిస్తా పెట్టాలి. వీటిని ఒవెన్​లో అయితే 170 డిగ్రీల టెంపరేచర్​లో 20 నిమిషాలు ఉడికించాలి. లేదంటే.. ప్రెజర్​ కుక్కర్​లో అరకిలో ఉప్పు వేసి, స్టాండ్ ఉంచి, మూత పెట్టాలి. స్టాండ్ వేడయ్యాక దానిమీద నాన్​ ఖటాయ్​లు ఉన్న స్టీల్​ ప్లేట్​ని పెట్టాలి. పావుగంటపాటు ఒక మాదిరి మంట మీద ఉడికించాలి. గాలి చొరబడని డబ్బాలో వీటిని ఉంచితే నెల రోజులు ఫ్రెష్​గా తినొచ్చు.