తక్కువ టైంలో..టాలీవుడ్‌‌లో బిజీ అయిన శ్రీలీల

తక్కువ టైంలో..టాలీవుడ్‌‌లో బిజీ అయిన  శ్రీలీల

కేవలం రెండంటే రెండు సినిమాలతో టాలీవుడ్‌‌లో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్‌‌గా మారింది శ్రీలీల. ఇటీవలి కాలంలో ఇంత తక్కువ సమయంలో బిజీ అయిన హీరోయిన్ మరొకరు లేరు. యంగ్ హీరోలు మొదలు స్టార్ హీరోల సినిమాల వరకూ ఎటు చూసినా శ్రీలీలనే కనిపిస్తోంది. మొత్తం ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. 

ఐదు సినిమాల రిలీజ్‌‌ డేట్స్‌‌ కూడా ఫిక్స్ అయ్యాయి. వీటిలో ముందుగా వస్తోన్న సినిమా ‘స్కంద’. రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన పాటలో మాస్‌‌ స్టెప్స్‌‌తో ఆకట్టుకుంది శ్రీలీల. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్‌‌ కేసరి’లో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది.

అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. వైష్ణవ్‌‌ తేజ్‌‌కి జంటగా ఆమె నటిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 10న విడుదల కానుందని ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇందులో రాయలసీమ అమ్మాయిగా కనిపించనుంది. నితిన్‌‌కు జంటగా నటిస్తున్న ‘ఎక్స్‌‌ ట్రా’ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. 

ఈ లెక్కన ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు నెలరోజుల గ్యాప్‌‌తో వస్తున్నాయి. అలాగే సంక్రాంతికి మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సినిమాలు రాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీలీల ఇదే జోరు కొనసాగించ బోతోంది.