శ్రీలంక విన్..భారత్ ఫైనల్ వెళ్లడం కష్టమే..

శ్రీలంక విన్..భారత్ ఫైనల్ వెళ్లడం కష్టమే..

కీలకమైన మ్యాచ్లో భారత్ చేతులెత్తేసింది. ఆసియా కప్లో భారత్ను శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. 173 టార్గెట్ తో గ్రౌండ్ లోకి దిగిన లంక 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే శ్రీలంక ఓపెనర్లు దూకుడుగా ఆడారు. 10 ఓవర్ల అయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 89 రన్స్ చేసి టార్గెట్ ను ఈజీ చేశారు. ఓపెనర్లు మెండిస్ (57), నిస్సాంక 52 రన్స్ చేశారు. భారత్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. 

చాహల్ డబుల్ బొనాంజ

ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో చాహల్ డబుల్ బొనాంజ అందించాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి శ్రీలంక దూకుడుకు కల్లెం వేశాడు. ఆ తర్వాత ఓవర్ లో అశ్విన్ మరో వికెట్ తీయగా.. 14 ఓవర్ లో చాహల్ ఇంకో వికెట్ తీసి గెలుపుపై ఆశలు కల్పించారు. అక్కడినుంచి లంక బ్యాటర్లు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఆడారు. పాండ్యా వేసిన 18ఓవర్ లో 12 రన్స్, భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్ లో 14 రన్స్ చేసి తమ జట్టును విజయానికి మరింత చేరువ చేశారు. ఇక చివరి ఓవర్ లో అర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఫలితం లేకుండా పోయింది.

హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 173 రన్స్ చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలోనే  కీలకమైన 2 వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ డకౌట్ అయ్యాడు. దిల్లాన్ మధుషంక వేసిన మూడో ఓవర్ లో భారీ షాట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

కోహ్లీ ఔట్ అవడంతో 13 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్ తో స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ఆ తర్వాత  వచ్చిన పాండ్యా, పంత్ తక్కువ స్కోర్లకే ఔట్ అవడంతో భారత్ 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా, చమిక కరుణరత్నే, దసున్ షనక రెండేసి వికెట్లు తీశారు.