సీడీఎస్ అంత్యక్రియలకు విదేశీ సైనిక కమాండర్లు

సీడీఎస్ అంత్యక్రియలకు విదేశీ సైనిక కమాండర్లు

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పొరుగు దేశాల సైన్యాధిపతులు, కమాండర్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌‌ శ్మశానంలో శ్రీలంక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) షవేంద్ర సిల్వ, మాజీ సీడీఎస్ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి వైజేగుణరత్నే.. బిపిన్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అడ్మిరల్ రవీందర చంద్రసిరి-బిపిన్ రావత్ కు మంచి స్నేహితుడు. వారిద్దరూ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో కోర్స్ మేట్ కూడా.

ఇక రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ బ్రిగేడియర్ డోర్జీ రిన్ చెన్, నేపాల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాల్ క్రిష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్ముడ్ ఫోర్సెస్ డివిజన్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టింనెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ కూడా బిపిన్‌ అంతమ సంస్కారాల్లో పాల్గొని నివాళి అర్పించారు.

కాగా,  బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్ర వారి ఇంటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమైంది. రావత్ కూతుర్లు నివాళులు అర్పించిన తర్వాత.. రావత్ దంపతుల పార్ధివ దేహాలను వాహనంపైకి ఎక్కించారు. ఢిల్లీ అంతటా రావత్  ఫోటోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనం. ఢిల్లీ కామరాజ్ మార్గ్ లోని రావత్ ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలైంది. భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు హోరెత్తాయి. బిపిన్ రావ‌త్ అమ‌ర్ ర‌హే.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతదంటూ దేశ వీరుడికి జ‌నం వంద‌నాలు ప‌లికారు. నాలుగు గంటల సమయంలో ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌‌ శ్మశాన వాటికకు చేరుకుంది ఆయన అంతిమ యాత్ర. సీడీఎస్ అంత్యక్రియల ఏర్పాట్లను  గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌ పూర్తి చేసింది. ఇదే రెజిమెంట్‌లో తొలుత చేరిన ఆర్మీలో చేరిన బిపిన్ ఆ తర్వాత దీనిని కమాండ్ స్థాయికి ఎదిగారు. అంత్యక్రియల్లో ఆయనకు 17 గన్‌ సెల్యూట్‌తో సైన్యం గౌరవ వందనం చేయనుంది.