పాకిస్తాన్ చిత్తు..ఆసియాకప్ ఫైనల్కు శ్రీలంక

పాకిస్తాన్ చిత్తు..ఆసియాకప్ ఫైనల్కు శ్రీలంక

మహిళల ఆసియాకప్ 2022లో శ్రీలంక టీమ్ అదరగొట్టింది. పటిష్ట పాకిస్తాన్ ను 1 పరుగు తేడాతో ఓడించి..ఫైనల్ కు దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన సెమీస్ లో పాకిస్తాన్ చివరి బాల్ కు మూడు పరుగులు చేయలేక ఓటమిపాలైంది. 

తక్కువ స్కోరు..
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసింది. హర్షితా సమరవిక్రమా 41 బంతుల్లో  35 పరుగులు, అనుష్క సంజీవని 21 బంతుల్లో  26 రన్స్ సాధించారు. పాకిస్తాన్ బౌలర్లలో నస్రా సంధు 3 వికెట్లు పడగొట్టగా...సదియా ఇక్బాల్, నిదా దార్, అన్వర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. 

ఛేదించలేక చతికిలపడింది..
ఆ తర్వాత 123 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్..20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులే చేసింది. బిస్మా మరూఫ్ 41 బంతుల్లో 42 పరుగులు, నిదా దార్ 26 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఇక చివరి ఓవర్‌లో పాకిస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. 6 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి3  పరుగులు చేయాల్సిన దశలో...శ్రీలంక  చాకచక్యంగా వ్యవహరించి నిదా దార్ను  రనౌట్ చేసి విజయాన్నందుకుంది. 

మెన్స్కు ధీటుగా ఉమెన్స్
మెన్స్ ఆసియాకప్ లోనూ శ్రీలంక జట్టు ఫైనల్ చేరి..టైటిల్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉమెన్స్ టీమ్ కూడా ఫైనల్ చేరింది. ఫైనల్లో శ్రీలంక భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నెల 15న మహిళల ఆసియాకప్ ఫైనల్ జరగనుంది. ఉమెన్స్  ఆసియా కప్ ఇప్పటివరకు ఏడుసార్లు జరిగింది. ఇందులో ఆరు సార్లు టీమిండియానే విజయం సాధించింది.  ఒకసారి బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు  శ్రీలంకతో 2004, 2005, 2006, 2008 లో ఫైనల్ ఆడింది. వీటిల్లో టీమిండియానే విజయం సాధించడం విశేషం.