శ్రీలంక ప్రధాని రాజీనామా

శ్రీలంక ప్రధాని రాజీనామా

కొలంబో : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ప్రకటించింది. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి తమ రాజీనామా లేఖలను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు ప్రతిపక్షాలు రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో రాజపక్స పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇటీవల గోటబయ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కేబినెట్‌ భేటీలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు భారీగా పెరిగి ఆహార సంక్షోభం నెలకొంది. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.