ప్రతి ఇంటిపై శ్రీరాముడి జెండా ఎగిరేయాలి : సంయోజక్ నాగభూషణం

ప్రతి ఇంటిపై శ్రీరాముడి జెండా ఎగిరేయాలి : సంయోజక్ నాగభూషణం

నిర్మల్/మంచిర్యాల/జైనూర్/ఇచ్చోడ, వెలుగు: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటిపై రాముని జెండా ఎగరేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజక్ నాగభూషణం కోరారు. నిర్మల్​పట్టణం నటరాజ్ నగర్ కాలనీలో ప్రతి ఇంటిపై రాముని జెండా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 

రాముడి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఇండ్లలో సంబురాలు చేసుకోవాలని కోరారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జైనూర్​లోని జామ్ని హనుమాన్ మందిరం ముస్తాబైంది. గ్రామంలోని శ్రీరామ భక్తులు ప్రతి కుటుంబానికి అక్షింతలు పంచిపెట్టారు.  ఇచ్చోడ మండల కేంద్రంలోని గోశాల రామాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. 5 రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఉన్న మండలంలోని 30 మంది మహిళలు స్వామి సేవలో పాల్గొననున్నారు. ఇందుకు పట్టు వస్త్రాలతో పాటు అక్షింతలను ఆదివారం సిద్ధం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం చేపట్టనున్నారు. 

ప్రాణప్రతిష్ఠ పండుగలా జరుపుకోవాలి

శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని హిందువులంతా పండుగలా జరుపుకోవాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు. పట్టణంలోని గర్మిల్ల హనుమాన్ దేవాలయంలో స్వఛ్​ తీర్థ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందల ఏండ్ల హిందువుల కల రామ మందిరం సాకారవుతున్న వేళ ప్రతి ఒక్కరూ తమ సమీప గుడుల్లో, ఇండ్ల భజనలు చేయాలని కోరారు.