మ్యూజిక్ అంటే ఇష్టం.. అమ్మ వల్లే కలిగింది

మ్యూజిక్ అంటే ఇష్టం.. అమ్మ వల్లే కలిగింది

థ్రిల్లర్​ సినిమాలకి మ్యూజిక్​ చేయడం శ్రీచరణ్ పాకాల​కి కొట్టిన పిండి. అందుకు ఎగ్జాంపుల్​ ‘క్షణం, ఎవరు, గూఢచారి, తిమ్మరుసు, గరుడవేగ, నాంది’.. లాంటి సినిమాలు. సస్పెన్స్​, క్రైమ్​, ఇన్వెస్టిగేషన్​ బ్యాక్​డ్రాప్​లో వచ్చిన ఈ సినిమాలన్నింటికీ ట్యూన్స్​ కట్టింది ఈ మ్యూజిక్​ డైరెక్టరే. ఇవే కాదు ఈ మధ్య కాలంలో వచ్చిన  మరెన్నో స్పై థ్రిల్లర్స్​కి తన బిజిఎమ్​ (బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​) తో ప్రాణం పోశాడు ఈ మ్యుజీషియన్​. 

ఇంతకుముందు​ థ్రిల్లర్​ సినిమాలు ఎక్కువగా తమిళ, మలయాళంలోనే తీసేవాళ్లు. కానీ, ఇప్పుడు తెలుగులోనూ వీటి హవా కనిపిస్తోంది. అలా ఈ మధ్య టాలీవుడ్​లో  థ్రిల్లర్​​ బ్యాక్​డ్రాప్​లో  వచ్చిన సినిమాలు చాలావరకు ఆడియెన్స్​ని మెప్పించాయి. అయితే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్​ అంటే కత్తిమీద సాములాంటిదే. బ్యాక్​గ్రౌండ్ స్కోర్​తోనే ప్రతి సీన్​ని ఎలివేట్​ చేయాలి. నెక్స్ట్​ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెంచాలి. ఈ విషయంలో  శ్రీచరణ్​కి​  వందకి వంద మార్కులు పడతాయి. అందుకే స్పై థ్రిల్లర్స్​కి మ్యూజిక్​ అనగానే మొదట గుర్తొచ్చే పేర్లలో ఈయన ​ కూడా ​ చేరిపోయాడు. కానీ, థ్రిల్లర్స్​తో హిట్స్​ కొడుతున్నా.. నాకు మెలోడి పాటలకి ట్యూన్స్​ కట్టాలని ఉందంటున్నాడు​. అంతేకాదు ఇంటర్​ పూర్తయ్యే వరకు మ్యూజిక్ గురించి ఆలోచనలే లేవట శ్రీ చరణ్​కి. మరెలా మ్యూజిక్​ వైపు వచ్చారంటే ఇలా చెప్పుకొచ్చాడు.  

గిటార్​ నేర్చుకోవాలనుకున్నా..
‘నేను పుట్టింది, పెరిగిందంతా వైజాగ్​లోనే. మా అమ్మానాన్నలిద్దరూ పోస్ట్​ గ్రాడ్యుయేట్స్​. దాంతో చదువు విషయంలో బాగా స్ట్రిక్ట్​గా​ ఉండేవాళ్లు. నాకు కూడా పాఠాలు తప్పించి మరో ఆలోచనలు ఉండేవి కావు చిన్నప్పుడు. అందుకే బుద్ధిగా చదువుకునేవాడ్ని. కానీ, గజల్స్​ బాగా వినేవాడ్ని. తెలుగు, హిందీ సినిమాల పాత పాటలు కూడా వినేవాడ్ని. అందుకు కారణం మాత్రం అమ్మ. తనకి మ్యూజిక్​ అంటే చాలా ఇష్టం. బాగా పాడుతుంది కూడా. అలా పరిచయమైన పాటలు ఇంటర్​ పూర్తయ్యాక  మరింత దగ్గరయ్యాయి. దానికి కారణం నా ఫ్రెండ్స్ దూరమవ్వడమే. 

ఇంటర్​లో నా క్లోజ్​ ఫ్రెండ్స్​ అంతా నాన్​లోకల్స్​. వాళ్లతో కలిసి ఓ రేంజ్​లో షికార్లు చేసేవాడ్ని. కానీ, ఇంటర్​ పూర్తయ్యాక వాళ్లంతా కెరీర్ కోసం ఎవరి దార్లో వాళ్లు వెళ్లిపోయారు. ఆ టైంలో బాగా లోన్లీ ఫీలయ్యా. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు గిటార్​ నేర్చుకోవాలనుకున్నా. మా అన్నకి గిటార్ తెలియడంతో కొంచెం ప్రాక్టీస్​ చేయించాడు. ఆ ప్రాసెస్​ నచ్చి,.. ఇంటర్నెట్​ సాయంతో మరింత పర్ఫెక్ట్​ అవ్వాలనుకున్నా. ఐదేళ్లలో నా అంతట  నేనే ట్రైన్​ అయ్యా. ఆ తరువాత ఒకరోజు ఒక పాట ప్లే చేస్తుంటే మా కజిన్​ విని,‘ఎక్కడ నేర్చుకున్నావు’?​ అని అడిగాడు. సొంతంగానే అని చెప్పా. తను ఫారిన్​లో గిటార్​ నేర్చుకోవడంతో నన్ను కూర్చోబెట్టుకొని టెక్నిక్స్​ అన్నీ చెప్పాడు. అలా గిటార్​పై మరింత గ్రిప్​ వచ్చింది. ఆ మధ్యలోనే ఒక లోకల్​ బ్యాండ్​లో గిటారిస్ట్​గా, సింగర్​గా చేరా. రాక్​, ఫ్యూజన్, జాజ్​ మ్యూజిక్​లో  ఎన్నో పర్ఫార్మెన్స్​లు ఇచ్చా. నా ఫ్రెండ్స్​ తీసిన షార్ట్​ ఫిల్మ్స్​కి, సోషల్​ అవేర్​నెస్​ డాక్యుమెంటరీలకి కూడా మ్యూజిక్ ఇచ్చా. 
అవకాశం అలా వచ్చింది.

ఏదేమైనా నచ్చిన పని చేయాలనుకున్నా. అందుకే ఇంట్లోవాళ్లకి ఇష్టం లేకపోయినా డిగ్రీ మధ్యలోనే ఆపేశా. పూర్తి కాన్సన్​ట్రేషన్​ మ్యూజిక్​ మీద పెట్టా. అయితే అప్పటికీ సినిమా ఆలోచనలు లేవు నాకు. కానీ, నా ఫ్రెండ్​ ‘క్షణం’ డైరెక్టర్​ రవికాంత్​ సలహాతో ఇండస్ట్రీకి రావాలనుకున్నా. అప్పటికే రవి.. అడివి శేషు దగ్గర చేరాడు. నేను కంపోజ్​ చేసిన ఒక పాట తనకి బాగా నచ్చడంతో.. అడివి శేషు ‘కిస్’​ సినిమాకి నన్ను రిఫర్​ చేశాడు. అలా మొదటిసారి 2011 లో ఒక గిటారు, హార్డ్​ డిస్క్​ పట్టుకుని వైజాగ్​ నుంచి హైదరాబాద్ వచ్చా. అప్పటి వరకు వెస్ట్రన్​ మ్యూజిక్​లో ఉన్న నాకు సినిమా పాటలు కొత్త సబ్జెక్ట్​లా అనిపించాయి. దాంతో చాలా కష్టపడ్డా. దగ్గర దగ్గర ఇరవై డెమోలు పట్టుకుని అడివి శేషుని కలిశా. అవి విని, ‘బాగున్నాయని’ చెప్పి వెళ్లిపోయారాయన. దాంతో ఆశలన్నీ వదిలేసుకున్నా. కానీ, ఆ తర్వాత మళ్లీ  ఫోన్​ చేసి సినిమాలో ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా రావడంతో... మరో సాంగ్​ ఇచ్చారు..అది విన్నాక ఆల్బమ్​ అంతా నాతోనే చేయించారు. కానీ, పాటలన్నీ బాగున్నప్పటికీ ఆ సినిమా ఆడకపోవడం నాకు మైనస్​ అయింది. దాంతో తిరిగి వైజాగ్​ వెళ్లిపోయా. 

ఆ తర్వాత...
ఇండస్ట్రీలో కాంటాక్ట్స్​ లేవు. డైరెక్టర్స్​కి నా సాంగ్స్​ వినిపించాలి..డెమోలు​ ఇవ్వాలని తెలీదు. దాంతో ఆ సినిమా రిలీజ్​ అయ్యాక  వైజాగ్​ వెళ్లిపోయా.  మొదట్నించీ మా వాళ్లకి నేను మ్యూజిక్​ అంటూ తిరగడం ఇష్టం లేదు. ‘ఈ ఫీల్డ్​లో సస్టైన్​ అవ్వడం ఈజీ కాదు. ఉద్యోగం చేసుకోమ’ని గ్రౌండ్​ రియాలిటీ చెప్తుండేవాళ్లు ఎప్పుడూ. నేను తిరిగి ఇంటికెళ్లేసరికి మ్యూజిక్ వద్దంటే వద్దని తేల్చి చెప్పేశారు. కానీ, నేను మాత్రం ఏదేమైనా మ్యూజిక్​యే​ నా కెరీర్​ అనుకున్నా. మళ్లీ బ్యాండ్​తో కలిసి పర్ఫార్మెన్స్​లు ఇచ్చా. ఆల్రెడీ ఒక సినిమాకి వర్క్​ చేసి తిరిగొచ్చి బ్యాండ్​లో వాయిస్తే  ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడారు. ఇతర స్టేట్స్​లో సెటిలైన వాళ్లు అయితే ‘నువ్వు ఇంకా హోటల్స్​లోనే వాయిస్తున్నావా? ’ అంటూ ఎగతాళి చేశారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్లా. అలా సాగిపోతున్న లైఫ్​కి మళ్లీ ఒక టర్నింగ్​ పాయింట్​ అయ్యాడు  రవికాంత్​. తను డైరెక్ట్​ చేస్తున్న ‘క్షణం’ సినిమాకి మ్యూజిక్​ డైరెక్టర్​గా అవకాశం ఇచ్చాడు. అదే టైంలో ‘గుంటూరు టాకీస్’​ డైరెక్టర్​కి డెమోలు వినిపించా​. రెండు సినిమాలు ఒకే టైంలో పట్టాలు ఎక్కడంతో మళ్లీ  హైదరాబాద్​ షిఫ్ట్​ అయ్యా.  ఆ టైంలో కొందరు ఫ్రెండ్స్​ చాలా హెల్ప్​ చేశారు.  

ఎక్స్​పెక్ట్​ చేయలేదు
‘క్షణం’కి పెద్దగా బడ్జెట్​ లేదు. బ్యాక్​ గ్రౌండ్​ స్కోర్​ కంపోజిషన్​కి సరిపడా టూల్స్​, ఎక్విప్​మెంట్​ కూడా లేదు. ఉన్నంతలోనే ది బెస్ట్​ మ్యూజిక్​ ఇవ్వాలనుకున్నా. దానికోసం చాలా కష్టపడ్డా. నా కష్టానికి తగ్గట్టే అవుట్​పుట్​ వచ్చింది. సినిమా రిలీజ్​ అయ్యాక అందరూ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​  గురించే మాట్లాడారు. ఆ వెంటనే రిలీజ్ అయిన ‘గుంటూరు టాకీస్’​ ఆల్బమ్​కి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. అమ్మనాన్న కూడా ఫుల్​ ఖుష్​. అయితే ‘క్షణం’ హిట్​ అవ్వడంతో స్పై, ఇన్వెస్టిగేషన్​  థ్రిల్లర్సే ఎక్కువగా వచ్చాయి నాకు. మధ్యమధ్యలో ఇతర జానర్స్​ కూడా ట్రై చేశా. అలా ఇప్పటివరకు అన్నీ కలుపుకుని ఇరవైకి పైగా సినిమాలకి మ్యూజిక్​ ఇచ్చా. వాటిల్లో ముందు చెప్పిన ‘క్షణం, గుంటూరు టాకీస్​తో పాటు గరుడ వేగ, రంగుల రాట్నం, గూఢచారి, ఇదంజగత్, జెస్సీ, ఎవరు, ఆపరేషన్​ గోల్డ్​ ఫిష్, అశ్వత్థామ, తిమ్మరుసు, నాంది’ లాంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. 

కంఫర్ట్​ ఎక్కువ ఉంటుంది
చాలామంది ఫలానా హీరోలు, డైరెక్టర్స్​తోనే ఎక్కువగా పనిచేస్తుంటారు ఎందుకని అడుగుతుంటారు. దానికి పర్టిక్యులర్​ రీజన్​ ఏం లేదు. ఆల్రెడీ వాళ్లతో కలిసి పనిచేయడం వల్ల ఒక కంఫర్ట్​ లెవల్​  ఉంటుంది. ఐడియాలజీ మ్యాచ్​ అవుతుంది. దానివల్ల మ్యూజిక్​ ప్రాసెస్​ తేలిక అవుతుంది. అందుకే అడివి శేషుతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటా. కమర్షియల్​ సినిమాల విషయానికొస్తే అవెందుకు రావట్లేదో నాకు అర్థం కాదు. మేబీ నేను ఎవర్నీ అప్రోచ్​ అవ్వకపోవడమే రీజన్​ అనుకుంటున్నా. చాలామందికి నా పాటలు తెలుసు. కానీ, నేను తెలియదు. అందుకే ఇకముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నా. ఏదో ఒకరోజు కచ్చితంగా కమర్షియల్​ సినిమాలు చేస్తా. 

అదే గోల్
నేను ఇండస్ట్రీకి కొత్త అవడంతో ఇలాంటి సినిమాలే చేయాలన్న పారామీటర్స్​ ఏం పెట్టుకోలేదు. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోయా. అయితే ప్రతీ సినిమాకి  నా వంద శాతం ఇచ్చా. కానీ, నాకు కామెడీ, మాస్, లవ్​ స్టోరీలంటే చాలా ఇష్టం. మెలొడీలకి ట్యూన్స్​ కట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం రిలీజ్​కి రెడీగా ఉన్న ‘మేజర్’ సినిమా​ నా కెరీర్​లో ది బెస్ట్​ ఆల్బమ్​ అవుతుందన్న నమ్మకంతో ఉన్నా. అలాగే ‘తెలిసినవాళ్లు’ అనే మరో సినిమాతో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్​​ చేతిలో ఉన్నాయి. పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే క్రికెట్​, బాస్కెట్​ బాల్ బాగా ఆడతా. సౌత్​ ఇండియన్, ఇటాలియన్​ ​ ఫుడ్​ ఎక్కువగా తింటా. బ్లాక్​ కలర్​ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా బ్లాక్​ షర్ట్స్​ వేసుకుంటా. దగ్గరదగ్గర పదేళ్లు బ్యాండ్​లో పర్ఫార్మెన్స్​లు ఇచ్చా.. టైట్​ షెడ్యూల్​ వల్ల వాటికి దూరమవ్వడంతో వెలితిగా ఉంది. అందుకే త్వరలో తెలుగు బ్యాండ్​ స్టార్ట్​ చేయాలనుకుంటున్నా. ఇళయరాజా గారి పాటల ఇన్​ఫ్లుయెన్స్​ చాలా ఉంటుంది నామీద. 
::: ఆవుల యమున