శ్రీలంక విన్..ఆరోసారి ఆసియా కప్ కైవసం

శ్రీలంక విన్..ఆరోసారి ఆసియా కప్ కైవసం

ఆసియా కప్ను శ్రీలంక కైవసం చేసుకుంది. టైటిల్ పోరులో పాకిస్తాన్ ను 23రన్స్ తో ఓడించింది. శ్రీలంక 170 రన్స్ చేయగా..పాక్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది శ్రీలంక. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక పాక్ బౌలర్ల ధాటికి మొదట్లో తడబడింది. కుశాల్ మెండిస్ ఫస్ట్ బాల్ కే డకౌట్ అవ్వగా..ఆ కొద్దిసేపటికే నిశంక, గుణతిలక కూడా అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన డిసల్వ నిలకడగా ఆడడంతో పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది.

పాక్ బౌలర్లు చెలరేగడంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడ్డ లంకను రాజపక్స ఆదుకున్నాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 45 బాల్స్ లో 71 రన్స్ చేసిన రాజపక్స..హసరంగతో కలిసి జట్టు స్కోర్ ను 170కి చేర్చాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా..షాదాబ్ ఖాన్, నసీమ్ షా, ఇఫ్తికార్ అహ్మద్ లకు ఒక్కో వికెట్ దక్కింది.

171 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ ఆరంభం నుంచే తడబడింది.కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి విఫలమవగా..ఫకర్ జమాన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో రిజ్వాన్, ఇఫ్తికర్ నిలకడగా ఆడి మూడో వికెట్ కు 71 పరుగులు జోడించారు. అయితే వరుస వికెట్లతో లంక బౌలర్లు పాక్ ను చిత్తు చేశారు. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు,హసరంగా 3 వికెట్లు పడగొట్టారు.