పాపన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి : శ్రీనివాస్ గౌడ్

 పాపన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి :  శ్రీనివాస్ గౌడ్
  •  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

సిద్దిపేట, వెలుగు: నేటి తరం యువత సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చిన్నకోడూరు మండలం గోనె పల్లిలో గౌడ సంఘం,  కౌండిన్య  యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో గౌడ్ లు ముఖ్యమంత్రిగా పనిచేసినా  కేసీఆర్ తరహాలో గౌడ్ లకు వైన్స్ షాప్ లలో రిజర్వేషన్ ను ఎవరు  తీసుకురాలేదన్నారు. 

బీఆర్ఎస్  ప్రభుత్వంలో అన్ని కుల సంఘాలకు విలువైన భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో మూసి వేసిన కల్లు దుకాణాలు వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. -మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్ వంటి తెలంగాణ పోరాట యోధుల చరిత్ర బయటకురాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చడమే కాకుండా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించామన్నారు. 

లండన్ లో విక్టోరియా మ్యూజియంలో పాపన్న గౌడ్ రాతి విగ్రహం ప్రతిష్టించారని తెలిపారు. కొత్త మద్యం షాపులకు 14న జీవో విడుదల చేస్తే 20న బయటకు వచ్చిందని, మద్యం షాపుల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల  నుంచి రూ.3 లక్షలకు పెంచారని మండిపడ్డారు.