గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి

గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి

బాల్కొండ, వెలుగు: మోర్తాడ్ మండలం గాండ్లపేట్ శివారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువకు గురువారం భారీ గండి పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు అక్విడక్ట్ డౌన్ స్ట్రీమ్ లో కాలువ మట్టి కొట్టుకుపోవడంతో గండి పడిందని ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్ధారించారు. సమీపంలో చెక్ డ్యాం నిర్మాణంతో నీరు నిలిచి రివిట్ మెంట్ దెబ్బతింది. గత నెల28న మిడ్ మానేరుకు నీటిని నిలిపివేశారు. భారీ గండి పడగా కాలువలో నిల్వ ఉన్న నీరు పెద్దవాగులో కలిసిపోయింది. 

ఒడ్డుకు ఉన్న వరి పొలాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఇసుక మేటలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్లతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేశారు. గండి పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

వరద గేట్లు మూసి ఉన్నాయని కెనాల్ లో నీటి నిల్వ తగ్గిన వెంటనే సమస్య తెలుసుకుని పరిష్కరిస్తామని ఈఈ చక్రపాణి, డీఈ గణేశ్​తెలిపారు. ప్రస్తుతం వరద కాలువ అక్విడక్ట్ కు ఎలాంటి  ప్రమాదం లేదని చెప్పారు. పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడి నష్టపోయిన రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్ల సాయంతో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని ఎమ్మెల్యే సూచించారు. 

నేడు సెంట్రల్ టీమ్ పరిశీలన

వరద కాలువకు గండి పడడంతో సెంట్రల్ ఇరిగేషన్ టీమ్ శుక్రవారం పరిశీలించనున్నది.  కాలువ రివిట్ మెంట్ దెబ్బతిని 0.2టీఎంసీల నీరు పెద్దవాగులోకి వృథాగా పోయింది. మిడ్ మానేరుకు నీరందించే వరద కాలువ 122 కిలోమీటర్ల మేర సాగు నీరు అందిస్తోంది. యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో నీరందించేలా త్వరితగతిన మరమ్మతు చేస్తామని ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కె.సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.