శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. సెలవు రోజుల్లో... ప్రత్యేక దినాల్లో స్పర్శ దర్శనం రద్దు

 శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. సెలవు రోజుల్లో... ప్రత్యేక దినాల్లో స్పర్శ దర్శనం రద్దు

శ్రీశైలంలో  మంగళవారం నవంబర్ 14  నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగుతాయి. రద్దీ రోజుల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం వెల్లడించింది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారాలతోపాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. కార్తీక మాసంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలను ఏర్పాటు చేశారు. టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు.  

కార్తీక మాసంలోని శని, ఆది, సోమవారాల్లో భక్తులందరికి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చనను రద్దు చేసినట్లు వెల్లడించారు. శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. సాధారణ రోజుల్లో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 పాతాళ గంగ వద్ద శౌచాలయాలు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులకు, పాతాళగంగ మెట్ల మార్గం తదితర చోట్ల అవసరమైన మరమ్మతు పనులు పూర్తి చేశారు. కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్య నదీ హారతి ఏర్పాట్లు, కార్తీక మాసంలో ఆకాశ దీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉదయం 10.30 గంటల నుంచే అన్నదానం ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి భక్తులకు అల్పాహారం పంపిణీ చేస్తారు. క్యూ లైన్లలో ఉన్నవారికి బిస్కెట్లు, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేస్తారు. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు.