- జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్
మహబూబ్ నగర్ రూరల్/హన్వాడ, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలోని లాల్య నాయక్ తండా, గుడిమల్కాపూర్, రాంనాయక్ తండాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శుక్రవారం సందర్శించి, గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాల్య నాయక్ తండాలో ఇండ్ల మధ్య ఉన్న 11 కేవీ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ల తొలగింపుపై గత పదేండ్లుగా విన్నవించినా అధికారులు స్పందించడం లేదని, షిఫ్టింగ్ కోసం రూ.12 లక్షలు అడుగుతున్నారని తండావాసులు ఆయన దృష్టికి తెచ్చారు.
వివిధ తండాల నుంచి ప్రధాన రహదారుల వరకు ఉన్న మట్టి రోడ్ల వల్ల వర్షాకాలంలో అంబులెన్సులు రావడానికి కూడా ఇబ్బంది అవుతోందని ప్రజలు విన్నవించారు. దీంతో రెండు నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను హుస్సేన్ నాయక్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, తండాల్లో నెలకొన్న విద్యుత్, రోడ్డు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, తహసీల్దార్ కిష్ట్యా నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

