రాములోరి ఆలయ స్టాఫ్ తీస్కున్న అడ్వాన్సుల లెక్క తేలట్లే: ఈఓ రమాదేవి

రాములోరి ఆలయ స్టాఫ్ తీస్కున్న అడ్వాన్సుల లెక్క తేలట్లే:  ఈఓ రమాదేవి
  • రూ.45.42లక్షలకు ఓచర్లు సమర్పించలే 
  • 27 మందికి ఫైనల్​ నోటీసులు జారీ చేసిన ఈఓ రమాదేవి

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణ కోసం స్టాఫ్ తీసుకున్న అడ్వాన్సుల లెక్క తేలడం లేదు. 27 మంది తీసుకున్న రూ.45లక్షల 42వేల 875కు ఓచర్లు సమర్పించకపోవడంతో ఆలయ ఈఓ రమాదేవి బుధవారం వారందరిరై ఫైనల్​ నోటీసులు జారీ చేశారు. ఐదు రోజుల్లో ఓచర్లు సమర్పించాలని, లేని పక్షంలో సొమ్ము మొత్తం రికవరీ చేస్తామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్, అటెండర్, అర్చకులు, ఉప అర్చకులు, పరిచారక, ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈలు ఉన్నారు. 

2022–23 ఆర్థిక సంవత్సరంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, సీతారాముల కల్యాణంతోపాటు ఇతర ఉత్సవాల నిర్వహణలో భాగంగా అత్యవసర పనుల కోసం దేవస్థానం సిబ్బందికి అడ్వాన్సులు ఇచ్చింది. ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారో తర్వాత బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే 27 మంది సిబ్బంది నేటికీ సమర్పించలేదు. ఈఓగా రమాదేవి బాధ్యతలు చేపట్టాక పెండింగ్ అడ్వాన్సులపై ఫోకస్​పెట్టారు. ఇప్పటికే రెండుసార్లు మే 5, జూన్​5 తేదీల్లో వారందరికి నోటీసులు ఇచ్చారు. రెండు నెలలుగా ఎలాంటి స్పందన రాలేదు. మే, జూన్ లో వేతనాలు ఆపినా స్పందించలేదు. ఓ సూపరింటెండెంట్ రూ.4.55లక్షలు, జూనియర్ అసిస్టెంట్ రూ.2.53 లక్షలు, 6సీ టెంపుల్​ జూనియర్ అసిస్టెంట్ రూ.1.71లక్షలు, రికార్డు అసిస్టెంట్ రూ.3.18లక్షలు, ఇంజనీరింగ్​విభాగంలోని ఏఈ ఒకరు రూ.1.43లక్షలు, మరో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కలిపి రూ.10.50 లక్షలు, ఉప అర్చకుడు రూ.3.07లక్షలు, రికార్డు అసిస్టెంట్ ఒక్కరే రూ.9.23లక్షలు లెక్క చెప్పలేదు. 

నిర్లక్ష్యమే కొంప ముంచింది

ఉద్యోగుల నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది. ఉత్సవాల సమయంలో స్వామికి రోజూ రకరకాల సేవలు జరుగుతుంటాయి. బోయీలను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొస్తారు. వారికి రోజువారీ వేతనం సంబంధిత రికార్డు అసిస్టెంట్ అడ్వాన్సుల నుంచి చెల్లిస్తారు. సూపరింటెండెంట్లు కూడా ఖర్చు చేస్తారు. ఆ బిల్లులను సకాలంలో సమర్పించాలి. కానీ అలా చేయలేదు. అత్యవసర సమయంలో స్థానికంగా కొన్ని వస్తువులు కొంటారు. వాటికి సంబంధించిన బిల్లులతో ఓచర్లు సమర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.