విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందికి కొత్త చిక్కులు

విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందికి కొత్త చిక్కులు

విస్తారా ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సరఫరా వ్యవస్థలో సమస్య కారణంగా విస్తారా విమానాల్లో సేవలందించే క్యాబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. దీంతో తమ సిబ్బంది కొద్దిరోజులు వంకాయ (ఊదా,Violet color ) రంగు దుస్తులకు బదులు, నల్లటి దుస్తుల్లో సేవలందిస్తారని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని విస్తారా సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. 

‘‘మా సంస్థ సర్వీసులను విస్తరించడంలో భాగంగా సిబ్బంది సంఖ్యను కూడా పెంచాం. అయితే.. డిమాండ్‌కు తగిని సరఫరా లేని కారణంగా మా క్యాబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. కానీ.. విమాన సర్వీసుల ద్వారా ప్రయాణికులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో యూనిఫామ్‌ లేకున్నా... సిబ్బందిని విధులకు హాజరుకావాలని సూచించాం. ఇందులో భాగంగా కొద్ది రోజుల పాటు మా సిబ్బంది బ్లాక్‌ ప్యాంట్‌, విస్తారా లోగో ఉన్న పోలో టీ-షర్ట్‌లు ధరించి.. సేవలందిస్తారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలుకుతాం’’ అని విస్తారా సంస్థ ట్వీట్‌ చేసింది. 

గతంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తో కలిసి టాటా గ్రూప్‌ నిర్వహించింది. ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలని టాటా గ్రూప్‌ భావించింది. ఇందులో భాగంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను గత ఏడాది ఎయిరిండియాలో విలీనం చేసిన విషయం తెలిసిందే.