ఫామ్‌‌హౌస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు రంగం సిద్ధం

ఫామ్‌‌హౌస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు రంగం సిద్ధం
  • కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌‌లో విచారణకు ఏర్పాట్లు  
  • సిట్ కుట్ర చేస్తోందంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్

హైదరాబాద్‌‌, వెలుగు:  మొయినాబాద్ ఫామ్‌‌హౌస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పలువురు ప్రముఖులను ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కేరళకు చెందిన తుషార్, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్‌‌ సంతోష్‌‌, కరీంనగర్‌‌‌‌కు చెందిన లాయర్ శ్రీనివాస్‌‌లకు రెండు రోజుల క్రితమే సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు రాకపోతే అరెస్టు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు బంజారాహిల్స్‌‌లోని కమాండ్ అండ్‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. నోటీసుల్లో పేర్కొన్న మేరకు వారు సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.  వారి నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు సిట్‌ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. 

కుట్రను అడ్డుకోండి.. హైకోర్టుకు బీజేపీ   

ఫాంహౌస్ కేసులో బీఎల్ సంతోష్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలంటూ శుక్రవారం బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. హైకోర్టు సింగిల్ జడ్జి పర్మిషన్ తీసుకోకుండానే సిట్ నోటీసులు ఇస్తోందని ఈ మేరకు బీజేపీ రాష్ట్ర జనరల్‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌రెడ్డి రిట్‌‌ పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుల వివరాలు, ఇతర సమాచారం సీక్రెట్ గా ఉంచాలని హైకోర్టు ఆదేశించినా.. ఈ నెల 17న పలువురికి నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఎవిడెన్స్‌‌ లేకపోయినా నిందితులతో బీజేపీ లీడర్ల పేర్లను చెప్పించి కేసులో ఇరికించేందుకు సిట్ కుట్ర చేస్తోందన్నారు. మొబైల్, ల్యాప్‌‌టాప్, ఇతర డివైజ్‌‌లను తీసుకురావాలని, డేటాను డిలీట్‌‌ చేయకూడదని నోటీసులో పేర్కొన్నారని వివరించారు. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్ కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారన్నారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వాళ్లను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలూ ఉన్నాయన్నారు. సిట్‌‌ నోటీసులపై స్టే ఇవ్వాలని, ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు.