ఎప్పటికీ హిందీ భాషకు బానిసలం కాబోము : తమిళనాడు సీఎం స్టాలిన్

ఎప్పటికీ హిందీ భాషకు బానిసలం కాబోము : తమిళనాడు సీఎం స్టాలిన్

ప్రధాన భాషగా హిందీని ఎంపిక చేసే విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మండిపడ్డారు. తాము ఎప్పటికీ హిందీ భాషకు బానిసలం కాబోము అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన భాష ఎంపిక అంశంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశంలో శుక్రవారం (ఆగస్టు 4వ తేదీన) అమిత్‌ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

విపక్షాలు అడ్డుపడుతున్నా.. హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. హిందీకి ఇతర భాషలేవీ పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారా దేశం సాధికారత సాధిస్తుందని అమిత్‌షా కూడా సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

అమిత్ షా వ్యాఖ్యలపై స్టాలిన్ మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు హిందీయేతర భాషలు మాట్లాడేవారిని లొంగదీసుకునే ప్రయత్నమే అని చెప్పారు. హిందీ ఆధిపత్యాన్ని తమిళనాడు తిరస్కరిస్తుందన్నారు. ఈ విషయంలో కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. తమిళనాడులో 1965 నాటి హిందీ వ్యతిరేక ఆందోళలను మళ్లీ తీసుకురావొద్దు అంటూ స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. 

సెంట్రల్‌ యూనివర్సిటీలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.