నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. ఆగని తరుగు దోపిడీలు

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. ఆగని తరుగు దోపిడీలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీలు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో హమాలీలు కాంటాలు సైతం నిలిపేశారు.  ధాన్యం లోడుతో వెళ్లిన ఒక్కో లారీ రైస్ మిల్లు దగ్గర మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. చేసేదేమీ లేక ఖర్చు ఎక్కువైనా ట్రాక్టర్లతో మిల్లులకు తరలిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.  మరి కొందరు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారు.

తరుగు పేరుతో దోపిడీ

బస్తాకు మూడు కిలోలు తరుగు తీస్తేనే లారీలో ఎక్కిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్ మండలం మొక్కట్రవ్ పేట్ లో ఓ రైతు పండించిన 380  బస్తాల ధాన్యాన్ని మిల్లర్లు వెనక్కి పంపారు.  దిక్కు తోచని స్థితిలో కొనుగోలు కేంద్రంలోనే టార్పాలిన్ కప్పి ధాన్యాన్ని సంరక్షిస్తున్నాడు ఆ కర్షకుడు.

 ముత్తునూరు గ్రామానికి చెందిన సంఘ గురువయ్య అనే రైతు 16 క్వింటాళ్ల ధాన్యానికి వచ్చే డబ్బుల్లో 32 వేల రూపాయలు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సొసైటీలు, రైస్ మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.