ఫీజు తెమ్మని చెయ్యిపై స్టాంప్​ వేశారు

ఫీజు తెమ్మని  చెయ్యిపై స్టాంప్​ వేశారు

ఫీజు కొంచెం లేట్​అయిందనుకోండి.. స్కూలోళ్లు ఏం చేస్తారు? స్టూడెంట్​ ఇంటికి నోట్​ పంపుతారు. అప్పటికీ కట్టలేదనుకోండి.. పిల్లలను క్లాసు బయట నిలబెడతారు. అయినా కట్టకపోతే, స్కూలుకే రానివ్వరు. కానీ, పంజాబ్​ లూధియానాలోని ఓ స్కూల్​ ఇదిగో ఇలా చేసింది. చెయ్యిపై స్టాంపేసి పంపింది. అతడిది, అతడి అక్కది పెండింగ్​ ఫీజులు కట్టాలంటూ వాళ్ల తల్లిదండ్రులకు ఇలా నోట్​ పంపింది.

ఎస్​డీఎన్​ స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్న హర్ష్​దీప్​ సింగ్​ అనే స్టూడెంట్​కు శుక్రవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, విచారణకు ఆదేశించారు. ఏప్రిల్​, మే నెల ఫీజు ₹760, ఈ మధ్యే స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన అతడి అక్క పెండింగ్​ ఫీజు ₹6,805 కట్టాలంటూ స్టాంప్​ వేసింది స్కూల్​ యాజమాన్యం. పరీక్షలుండడంతో బ్యాగ్​ తెచ్చుకోలేదని, దీంతో వేరే పేపర్​ మీదో, లేదా క్వశ్చన్​ పేపర్​ మీదో నోట్​ రాయకుండా తన ఎడమ చెయ్యిపై ఫీజ్​ రిమైండర్​ స్టాంప్​ వేశారని ఆ విద్యార్థి చెప్పారు.

మే 25న ఫీజు మొత్తం కట్టేస్తామని స్కూలు యాజమాన్యానికి చెప్పినా ఇలాంటి పని చేయడం చాలా అవమానంగా ఉందని ఆ అబ్బాయి తండ్రి కుల్దీప్​ సింగ్​ అన్నాడు. ఆటో నడుపుకునే తాను రోజుకు ₹300 సంపాదిస్తున్నానని, తన పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తుంటాడని, ప్రతి నెలా 25న అతడికి జీతం వస్తుందని, ఆ రోజు డబ్బు కట్టేస్తామంటూ స్కూలుకు చెప్పామని అతడు చెప్పాడు. ఫీజు పెండింగ్​ ఉంటే తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడేదుండేనని అన్నాడు. ఈ ఘటనను స్కూలు ప్రిన్సిపాల్​ షమా దుగ్గల్​ సమర్థించుకున్నారు. ఎప్పుడు ఫీజు అడిగినా కట్టలేదని చెప్పారు. ఎన్నో సార్లు రిమైండర్లు పంపామని చెప్పారు. ఈ స్టాంప్​ ఈజీగానే చెరిగిపోతుందని, కానీ, అతడి తల్లిదండ్రులొచ్చి తనపై దౌర్జన్యం చేశారని ఆమె అన్నారు