ఇండియన్ రెస్టారెంట్ లో జానీడెప్ పార్టీ : రూ.48 లక్షల బిల్లు

ఇండియన్ రెస్టారెంట్ లో జానీడెప్ పార్టీ : రూ.48 లక్షల బిల్లు

'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' స్టార్‌ జానీడెప్ ఈ మధ్య వర్జీనియా కోర్టు కేసులో మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్ పై విజయం సాధించినందుకు విలాసవంతమైన డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లోని ‘వారణాసి’ అనే రెస్టారెంట్ లో ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్ కు పార్టీ ఇచ్చాడు. బర్మింగ్ హామ్ లో వారణాసి అతిపెద్ద భారతీయ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్‌లో సుమారు 400 మంది కూర్చునే వీలుంది. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్ టెయిల్స్, రోజీ షాంపెయిన్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్టు పత్రిక తమ కథనంలో పేర్కొంది. 

ఈ విందు కోసం జానీడెప్ 62,000 డాలర్లను( భారతీయ కరెన్సీలో దాదాపు రూ.48.1 ల‌క్ష‌లు) ఖర్చు చేశారట. ఆ పార్టీ సమయంలో జానీడెప్ చాలా సంతోషంగా కనిపించారు. రెస్టారెంట్ సిబ్బందితోనూ ఉత్సాహంగా గడిపి, ఫొటోలు కూడా దిగారు. జానీడెప్ అందరితోనూ కలివిడిగా ఉండే వ్యక్తి అంటూ వారణాసి రెస్టారెంట్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. 

ముందుగా నమ్మలేకపోయా : వారణాసి రెస్టారెంట్ మేనేజర్
పార్టీకి ముందు జానీ డెప్ భద్రతా సిబ్బంది సిటీ సెంటర్ లోని రెస్టారెంట్ ను పూర్తిగా తనిఖీలు చేశారు. ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తగా తనిఖీలు చేశారు. ‘ఆదివారం (జూన్ 5న) సాయంత్రం మాకు ఒక ఫోన్ వచ్చింది. జానీడెప్ తన మిత్రులతో కలిసి రెస్టారెంట్ కు వస్తారని ఫోన్ చేసి చెప్పారు. కానీ, మేము ముందుగా నమ్మలేదు. జానీ భద్రతా సిబ్బంది వచ్చి తనిఖీలు చేశాక నిజమే అని నమ్మాం. ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ల్యాంబ్ కరాహీ వంటి వంటకాలను వడ్డించారు’ అని వారణాసి రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ చెప్పారు. రెస్టారెంట్ సిబ్బందికి టిప్ కూడా భారీగానే ఇచ్చారట. ప్రస్తుతం జానీడెప్ ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్ తో కలిసి బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 5న వారణాసి భారతీయ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్నారు.