డబ్ల్యూఎఫ్​ఐ ప్రెసిడెంట్​ బ్రిజ్ భూషణ్​పై లైంగిక ఆరోపణలు

డబ్ల్యూఎఫ్​ఐ ప్రెసిడెంట్​ బ్రిజ్ భూషణ్​పై  లైంగిక ఆరోపణలు

న్యూఢిల్లీ: రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (డబ్ల్యూఎఫ్​ఐ) ప్రెసిడెంట్​ బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​పై.. స్టార్​ రెజ్లర్​ వినేశ్​ పోగట్​ సంచలన ఆరోపణలు చేసింది. చాలా ఏళ్ల నుంచి అతను విమెన్​ రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. లక్నోలో జరిగిన నేషనల్​ క్యాంప్​లోనూ కొంత మంది కోచ్​లు మహిళా రెజ్లర్లను వేధించారని తెలిపింది. అయితే తాను ఇలాంటి వేధింపులకు ఎప్పుడూ గురికాలేదని స్పష్టం చేసింది. ‘టోక్యో గేమ్స్​ ముగిసిన తర్వాత రెజ్లింగ్​లో నెలకొన్న ఇష్యూస్​పై నేను ప్రధానిని కలవాలనుకున్నా. కానీ ప్రెసిడెంట్​కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. నన్ను చంపేస్తామని బెదించారు. ప్రెసిడెంట్​ లైంగిక వేధింపులపై 10, 20 మంది రెజ్లర్లు నన్ను కలిశారు. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ల పేర్లు బయటకు చెప్పలేను. కానీ పీఎం, హోం మినిస్టర్​ను కలిసినప్పుడు కచ్చితంగా బహిర్గతం చేస్తా. ఈ ధర్నాలో పాల్గొన్న వారికి ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు బ్రిజ్​ భూషణే అవుతాడు’ అని బుధవారం జంతర్​మంతర్​ వద్ద నాలుగు గంటల పాటు ధర్నా చేసిన తర్వాత వినేశ్​ మీడియాతో వ్యాఖ్యానించింది.

స్టార్లు బజ్​రంగ్ పునియా, ​ సాక్షి మాలిక్, సరితా మోరె, సంగీతా పోగట్​, అన్షు మాలిక్​, సోనమ్​ మాలిక్​, సత్యవర్త్​ మాలిక్​ సహా 30 మంది రెజ్లర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 2019లో డబ్ల్యూఎఫ్​ఐ ప్రెసిడెంట్​గా బ్రిజ్​ భూషణ్​ వరుసగా మూడోసారి ఎన్నికయ్యాడు. రెజ్లింగ్​ ఫెడరేషన్​ను పూర్తి ఏకపక్షంగా నడిపిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే తాము ఏ ఇంటర్నేషనల్​ టోర్నీలో పాల్గొనబోమని బజ్​రంగ్​ పూనియా హెచ్చరించాడు. డిక్టేటర్​గా వ్యవహరిస్తున్న అతన్ని తక్షణమే తొలగించాలన్నాడు.