స్కూళ్లలో ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్ కనిపించగానే పలకరింపుగా గుడ్ మార్నింగ్ సర్, గుడ్ మార్నింగ్ మేడమ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పడం కామన్. అయితే గుడ్ మార్నింగ్ కు బదులు జైహింద్ చెప్పాలంటూ హర్యానా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. జెండా ఎగురవేసే ముందు నుంచి జైహింద్ ను అమలు చేయాలంటూ వెల్లడించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు
హర్యానాలో 14 వేల 300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 23లక్షల10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 7 వేల ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే విద్యార్థులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశారని.. భారతీయులను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు ఈ నినాదం ఉపయోగపడిందని తెలిపారు. ఆ సమయంలో నాయకులు ఒకరినొకరు జైహింద్ చెప్పుకుంటూ పలకరించుకునే వారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాయుధ బలగాలు దానిని గౌరవంగా స్వీకరించాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జైహింద్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. జైహింద్ అనేది ప్రాంతీయ భాషకు , సంస్కృతి బేధాలకు భిన్నంగా విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు.
