మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. 2009 లో 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే జూరాల డ్యాం చెక్కు చెదరలేదని, ఇప్పుడు లక్ష క్యూసెక్కుల నీటికే కూలిపోతోందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.

 నారాయణపేట పచ్చగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి రూ.4,500 కోట్లతో మక్తల్​–నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్ , మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీవో  రామచందర్ నాయక్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతు కుమార్, సివిల్ సప్లై అధికారి బాలరాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

నర్వ, వెలుగు: పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని  మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పాతర్​చేడ్ గ్రామంలో మంగళవారం రూ.28 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఇప్పటికే ఈ గ్రామానికి 20 ఇండ్లు మంజూరు చేశామని, అదనంగా మరో 20 ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ​మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులున్నారు. 

కాలేజీల భవన పనులు ప్రారంభించాలి

కోస్గి, వెలుగు: పట్టణంలో ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలల భవన పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వాటికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్, ప్రిన్సిపాల్​ శ్రీనివాసులు ఉన్నారు.