కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిని క‌లిసిన బండి సంజ‌య్

కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిని క‌లిసిన బండి సంజ‌య్

ఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఢిల్లీలో క‌లిశారు. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య నదీజలాల పంపిణీ విషయంపై చర్చించారు. కృష్ణ గోదావరి నది జలాల పంపిణీ, నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని గ‌జేంద్ర సింగ్ ను కోరారు సంజ‌య్. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య‌మంత్రులు ఇరుప్రాంతాల ప్రజలను మోసగిస్తున్నార‌ని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల కోసం టెండర్లు పిలుస్తారని కేంద్ర మంత్రికి వివరించారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ క్లిష్ట సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని ప్రజలను మోసం చేయడమేనని బీజేపీ భావిస్తున్న‌ట్టుగా సంజ‌య్ కేంద్ర మంత్రికి తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్, జ‌గ‌న్‌లు నదీ జలాల పంపకం వినియోగంపై ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం కలగకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని బీజేపీ కోరుతున్నట్టుగా చెప్పారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా 300 టీఎంసీలను సద్వినియోగం చేసుకోవడానికి కేసీఆర్ చొరవ తీసుకోకపోవడంపై తాము(బీజేపీ) తీవ్రంగా స్పందిస్తున్నామని తెలిపారు.ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసి అనావృష్టి , కరువు, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఉమ్మడి మహబూబ్ న‌గర్ , నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాధ్యమైనంత త్వరగా సాగు, తాగునీరు అందించాల‌ని కోరారు. అదే విధంగా ‌‌ హైదరాబాద్ కు కూడా తాగునీరు అందించాలని కోరారు బండి సంజయ్

రాష్ట్ర ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం, నీటి పంపిణీ లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల  సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆగస్టు మొదటి వారంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు గా చెప్పార‌ని బండి సంజయ్ మీడియాకు తెలిపారు.