అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ

అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం (అక్టోబర్ 23) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి, స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేస్తే హైకోర్టులోనే తేల్చుకోమనడంతో తదుపరి న్యాయపరమైన చర్యలు, ప్రత్యామ్నాయాలు, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనున్నది. 

ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన వివరాలను కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయి న్యాయపరమైన స్పష్టత వచ్చేవరకు ఎన్నికలను వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగే చాన్స్ ఉన్నది.