నామినేషన్ల ప్రక్రియలో అవాంతరాలు ఉండొద్దు

నామినేషన్ల ప్రక్రియలో అవాంతరాలు ఉండొద్దు
  •     ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా స్వీకరణ
  •     నిబంధనలకు తగ్గట్టుగా  నడుచుకోండి
  •     ఎన్నికల అధికారులకు సీఈఓ వికాస్ రాజ్ సూచన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారం భించాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్​ రాజ్​ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్ఓలు, ఏఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, సమస్యలు లేకుండా బందోబస్తుతో పాటు అన్ని ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు.

గురువారం ఉదయం 11 గంటలలోపు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. నామినేషన్ల గడువు ముగిసే వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఆర్వో కార్యాలయాల్లో స్వీకరించాలన్నారు. రాబోయే 30 రోజులు చాలా ముఖ్యమైనవని, అభ్యర్థి నుంచి నామినేషన్​ స్వీకరించేటప్పుడు ఆర్ఓలు ఆ అభ్యర్థిని చాంబర్‌‌లోకి నిబంధనలకు తగ్గట్టుగా అనుమతించాలని సూచించారు. అయితే ఎక్కు వ మందిని అనుమతించకూడదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి అవసరమైనప్పుడు మీడియాకు వివరాలు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఆన్‌‌లైన్‌‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని, ఒకసారి ఎన్నికల కమిషన్ పోర్టల్‌‌లోకి డేటాను ఫీడ్ చేస్తే, యాక్సెస్  చేయడానికి, సరిదిద్దడానికి అనేక విధానాలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక అభ్యర్థి తనకు ఎన్నికల సంఘం నిర్దిష్ట గుర్తును కేటాయించిందని క్లెయిమ్ చేస్తే, సంబంధిత ఆర్ఓ ఆ అభ్యర్థికి  ఎన్నికల సంఘం నుంచి అందిన కమ్యూనికేషన్‌‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఈఓ స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రక్రి యను ప్రస్తావిస్తూ.. పోలింగ్ స్టేషన్ల దగ్గర  క్యూలో ఉండేవాళ్ల కోసం ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు.