పడిపోతున్న పోలింగ్ శాతం.. సదువుకున్నోళ్లు, ధనవంతులు ఓటేస్తలే!

పడిపోతున్న పోలింగ్ శాతం..  సదువుకున్నోళ్లు, ధనవంతులు ఓటేస్తలే!
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో  24  సెగ్మెంట్లలో 59 శాతమే పోలింగ్
  • గ్రేటర్​ హైదరాబాద్‌‌ పరిధిలోని సెగ్మెంట్లలోనే తక్కువగా నమోదు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యావంతులు, ధనవంతులు పోలింగ్​కు దూరంగా ఉంటున్నారు. వారు ఓటేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ శాతం పడిపోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 24  నియోజకవర్గాల పరిధిలో అతి తక్కువ పోలింగ్‌‌‌‌ శాతం నమోదైంది.  రాష్ట్ర సగటు ఓటింగ్‌‌‌‌ శాతం 73.73 కాగా, ఈ నియోజకవర్గాల్లో కేవలం 42 నుంచి 59 శాతం మధ్యే నమోదైంది.

తక్కువ శాతం పోలింగ్​ నమోదైన సెగ్మెంట్లలో చాలా వరకు గ్రేటర్​ హైదరాబాద్‌‌ పరిధిలోనే ఉన్నాయి. ఇక రూరల్​ ఏరియాలో ఉండే పాలేరులో అత్యధికంగా 92 శాతం ఓట్లు పోలయ్యాయి. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఆ 24 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్​‌‌ శాతం పెంచడంపై కొన్ని నెలలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఫోకస్​ పెట్టింది. కొత్త ఓటర్ల నమోదుతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. 
 
ఏడు నియోజకవర్గాల్లో 90 శాతం ఓటింగ్‌‌‌‌

2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల 90 శాతానికి పైగా పోలింగ్‌‌‌‌ జరిగింది. 63 నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా, 22 చోట్ల 70 శాతానికి మించి, మూడు చోట్ల 60 శాతం పోలింగ్‌‌‌‌ నమోదైంది. మొత్తంగా రాష్ట్ర సగటు 73.73 శాతంగా తేలింది. 24 నియోజకవర్గాల్లో మాత్రం 42 నుంచి 59 శాతం ఓటింగ్‌‌‌‌ జరిగింది. మలక్‌‌‌‌పేట నియోజకవర్గంలో అతి తక్కువగా 42.30 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ ఏరియాల్లో పోలింగ్‌‌‌‌ పర్సంటేజీ పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా  ఆయా చోట్ల ఓటరు లిస్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన, వలస ఓటర్ల పేర్లు తొలగించారు. కాలేజీలు, కంపెనీల్లో  ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేశారు. అటు ఐటీ, సినీ ఇండస్ట్రీ,  వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఓటర్లను చైతన్యం చేసేందుకు 2కే రన్​లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.