ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

2025 –30 నూతన పర్యాటక విధానం ద్వారా మన రాష్ట్రంలో పర్యాటక రంగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ లక్ష్యాలను సాధించడానికి, పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025-30’ ప్రకారం పర్యాటక రంగంలో రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (GSDP)లో 10% కంటే ఎక్కువ వాటాను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ పాలసీ ద్వారా  సుమారు 3 లక్షల మంది కి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.  

ఆధునిక అభివృద్ధి, ఐటీ కేంద్రాలు మాత్రమే కాకుండా, పర్యాటక రంగంలోనూ తెలంగాణ విశిష్టమైన గుర్తింపును పొందుతోంది. చార్మినార్, గోల్కొండ, గద్వాల కోటలు, రామప్ప దేవాలయం, నాగార్జున సాగర్, కుంతాల జలపాతం వంటి సహజ సౌందర్యాలు,  బాసర, యాదాద్రి, జోగులాంబ శక్తి పీఠం  వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు తెలంగాణను విశ్వ పర్యాటకుల దృష్టిని ఆకర్షించే కేంద్రంగా నిలిపాయి. 2023లో తెలంగాణ రాష్ట్రం 5.86 కోట్ల పర్యాటకులను ఆకర్షించింది. ఇందులో 5.84 కోట్ల మంది దేశీయ పర్యాటకులు కాగా 1.6 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. 2024 డిసెంబర్​లో రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి మొట్ట మొదటిసారిగా టూరిజం పాలసీ 2025-–30 రూపొందించింది. దీని ద్వారా 2030 నాటికి 10 కోట్ల దేశీయ, 5 లక్షల విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

తెలంగాణ టూరిజం పాలసీ 2025-30

తెలంగాణలో ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలు హైదరాబాద్ లో  చార్మినార్, గోల్కొండ కోట, లార్ సాలార్​జంగ్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, వరంగల్​లో  కాకతీయ కళాత్మకత, భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయం (యునెస్కో వారసత్వ స్థలం) నాగార్జునసాగర్ - జలపాతాలు, బౌద్ధ స్థూపాలు నల్లమల అరణ్యాలు -అడవి పర్యాటకం, అమ్రబాద్  టైగర్ రిజర్వ్  బాసర, యాదాద్రి, వేములవాడ - ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు తెలంగాణ టూరిజానికి కొన్ని ఉదాహరణలు.

మెడికల్ టూరిజం హబ్ గా  హైదరాబాద్

 తెలంగాణ ఐ. టి, ఫార్మసీ, మెడికల్, టూరిజం హబ్​గా  ఎదుగుతోంది. 2014 లో 75 వేల పైగా విదేశీ యులు  వైద్య సేవల కోసం మన హైదరాబాద్​ను సందర్శించగా, 2024 లో 1.50 లక్షల మంది  ఇతర దేశాల  నుంచి హైదరాబాద్​కు వైద్య సేవల కోసం వచ్చారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రులు, అధునాతన సాంకేతికతతో కూడిన మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాయి. ఈ కారణంగానే 2024 సంవత్సరంలో వైద్య సేవల కోసం భారతదేశానికి వచ్చిన విదేశీయుల సంఖ్య 4.64 లక్షలు ఉండగా, వారిలో  1.51 లక్షల మంది హైదరాబాద్ లోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందారు.  హైదరాబాద్ లో మెడికల్ టూరిజం వాటా 30% ఉన్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి.

హైడ్రాతో  కబ్జాల కట్టడి 

బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు  10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ భూములను, రోడ్లను, మురికి కాలువలను కూడా కబ్జా చేశారు. అందుకే వారి కబ్జాలు బయటపెడతాయని హైడ్రా ఏర్పాటును  తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణను, కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దు అంటూ  హైడ్రాకు అధికారాలను కల్పించారు.  నేడు  ప్రజలు స్వయంగా హైడ్రాకు కబ్జాల గురించి నేరుగా ఫిర్యాదు అందిస్తున్నారు. 

చెరువుల పునరుద్ధరణ, నగర వరదల విపత్తుల నివారణ, ప్రభుత్వ భూములు పరిరక్షణ, రోడ్ విస్తరణ,సాఫీగా వాహనాల ప్రయాణం, డ్రైనేజీ వ్యవస్థ మూలంగా హైడ్రాకు పాలాభిషేకం  చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా తరహా  సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోట్ల విలువైన భూములను పరిరక్షించడంతో హైడ్రాను ప్రజలు  అభినందిస్తున్నారు. హైదరాబాద్​లో బతుకమ్మ కుంట అంబర్​పేట్​ ప్రాంతం ప్రసిద్ధమైన చెరువు.  

ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఐదు ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైంది.  నామరూపాలు లేకుండా పోయిన బతుకమ్మ కుంట పునరుద్ధరణతో హైడ్రా సహాయం తో పునరుజ్జీవం పోశారు. 

పర్యాటక కేంద్రంగా మూసి నది

మూసీ నది కృష్ణా నదికి ఉపనది. ఇది హైదరాబాద్ నగరం మధ్యగా  ప్రవహిస్తుంది. శతాబ్దాలుగా ఇది ప్రజలకు తాగునీరు, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. అయితే పట్టణీకరణతో పాటు నదిలో మురుగు నీరు, కార్ఖానాల వ్యర్థాలను వదలడం వలన మురికికూపంగా మారింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణ ద్వారా పరిసరాలను శుభ్రపరచడం, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రభుత్వం సౌత్ కొరియాలోని హాన్ నది ప్రాజెక్టును నమూనాగా తీసుకుని, మూసీ నది పునరుద్ధరణకు దాదాపు ₹ 25 వేల కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించింది.  ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నది నుండి 2.5 టీఎంసీఎఫ్టీ నీటిని మూసీ నదిలోకి మళ్లించడం, నది ఒడ్డున పర్యాటక కేంద్రాలు, సైకిల్ ట్రాక్​లు, రెస్టారెంట్లు, సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. పర్యాటకం మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, మన సంస్కృతి, చరిత్ర, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే మాధ్యమం.  పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ మన భవిష్యత్ తరాలకు విలువైన సంపదగా మారుతుంది. 

- సామ రామ్మోహన్​రెడ్డి, చైర్మన్, టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్