
- మిల్లుల కెపాసిటీ మేరకు ధాన్యం కేటాయింపు
- కేటాయించిన వడ్లకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే
- రోజు రెండు షిఫ్ట్‌ల్లో కలిపి 16 గంటలు మిల్లింగ్చేయాలి
- మోసాలకు తావులేకుండా కొత్త సీఎంఆర్ గైడ్ లైన్స్
- రెడీ చేసిన సివిల్ సప్లైస్ శాఖ.. త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు : కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లకు రాష్ట్ర సర్కారు ముకుతాడు వేయాలని నిర్ణయించింది. గత సర్కారు హయాంలో అసలు రైస్‌మిల్లులే లేనివాళ్లకు సైతం ధాన్యం కేటాయించగా, లెవీ పెట్టకుండా బయట మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈసారి సీఎంఆర్ నిబంధనలు కఠినతరం చేస్తున్నది.
ఈ వానకాలం సీజన్‌నుంచి ఆయా మిల్లుల సంఖ్య, వాటి కెపాసిటీ ఆధారంగానే ధాన్యం కేటాయించనుంది. గతంలో ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లను పూర్తిగా పక్కనపెట్టాలని భావిస్తున్నారు. అలాగే సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లకు బ్యాంక్ గ్యారెంటీ తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై సివిల్ సప్లయ్స్శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీఎంఆర్ గైడ్ లైన్స్ కఠినంగా రూపొందించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్రాగానే సీఎంఆర్మార్గదర్శకాలపై ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
కలెక్టర్లు పర్యవేక్షించాలి..
కొత్త గైడ్‌లైన్స్‌లో జిల్లాల వారిగా మిల్లింగ్‌పై కలెక్టర్లకు బాధ్యతలు ఇస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్ కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్ స్టాల్ చేసుకునేలా ఆయా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అలాంటి వారికే ధాన్యం కేటాయింపులు చేయాలని సూచించింది.
జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం ఇవ్వాలి. అధికారులు పలు దఫాలుగా మిల్లులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి. ధాన్యం షార్టేజ్ ను, దారిమళ్లినట్టు గుర్తించినా ఈసీ యాక్ట్ 1955 క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి.
67 శాతం సీఎంఆర్ ఇవ్వాలి
రెండు టన్నులు అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో బియ్యం అందించాల్సి ఉంటుంది. రెండు టన్నుల కెపాసిటీ ఉన్న మిల్లులకు 1,500 టన్నులు, నాలుగు టన్నుల కెపాసిటీ మిల్లులకు 3వేల టన్నులు, ఆరు టన్నుల కెపాసిటీ మిల్లులకు 4 వేల టన్నులు, ఎనిమిది టన్నుల కెపాసిటీ మిల్లులకు 5,500 టన్నులు, 10టన్నుల కెపాసిటీ మిల్లులకు 6,500టన్నులు, 12టన్నుల కెపాసిటీ అంత కంటే ఎక్కువ ఉంటే 8వేల టన్నులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. బాయిల్డ్ రైస్ మిల్లులకు అయితే 32 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉంటే 4 వేల టన్నులు ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. 40 టన్నుల కెపాసిటీ ఉంటే 5 వేల టన్నులు కేటాయించాల్సి ఉంటుంది. 50 టన్నుల కెపాసిటీ ఉంటే 6 వేల టన్నులు, 60 టన్నుల కెపాసిటీ ఉంటే 7 వేల టన్నులు ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. 60 టన్నుల కెపాసిటీ కంటే ఎక్కువ ఉంటే 8 వేల టన్నులు కేటాయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యంలో 68 శాతం బాయిల్డ్ రైస్ సీఎంఆర్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
డిఫాల్టర్లు, డ్యూస్ ఉన్నోళ్లకు నో చాన్స్..
మిల్లింగ్‌లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ సమాయత్తమైంది. గతంలో తీవ్రంగా జాప్యం చేసిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నవారికి ధాన్యం కేటాయించ వద్దని గైడ్లైన్స్సిద్ధం చేస్తున్నది. వీరికి ఈ సీజన్‌తో పాటు వచ్చే రెండు సీజన్ ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు.
డిఫాల్ట్ అయిన మిల్లర్లు వారు ఇవ్వాల్సిన సీఎంఆర్ డ్యూస్ క్లియర్ చేసుకుని జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫి కెట్ తీసుకుంటేనే కేటాయించనున్నారు. లీజు మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతో పాటు మిల్లు ఓనర్ నుంచి గ్యారంటీ తీసుకోవాలి. అలాగే, ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్న మిల్లర్లతో గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా స్థానిక జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గ్యారంటీని సమర్పించాలి.
25% బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి
ధాన్యం తీసుకునే మిల్లర్లు తప్పని సరిగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15రోజుల ముందే 25శాతం బ్యాంక్ గ్యారెంటీ ని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది.
లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్లు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సమర్పించడంతో పాటు అగ్రిమెంట్ చేసుకున్న తరువాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రాసెస్‌లో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవు.