
- రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు
- హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
- విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి వద్ద గ్రీన్ఫార్మాసిటీపై రాష్ట్ర సర్కారు స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఫార్మా సిటీ రద్దు కాలేదని హైకోర్టుకు తెలిపింది. 2016లో జారీ చేసిన జీవో 31 ప్రకారం ఇది యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాని రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీ కాలేదని తేల్చి చెప్పింది.
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ హైకోర్టులో శనివారం అఫిడవిట్ దాఖలు చేశారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఆంక్షలు తొలగించి, ధరణి పోర్టల్‌లో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన డీవీవీ సత్య కొండలరాయ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఫార్మాసిటీ భూములపై నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫార్మాసిటీ భూములకు చెందిన అన్ని పిటిషన్లపై ఈ నెల 23న విచారణ చేపడతామని తెలిపారు.
ఎన్ని వాయిదాలు తీసుకుంటరు: హైకోర్టు
యాచారం మండలం మేడిపల్లిలో సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ కొనసాగిస్తారా? లేదా? అని చెప్పడానికి ఎన్ని వాయిదాలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫార్మా సిటీ రద్దయినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను పిటిషనర్లు సమర్పించగా.. ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నది.
కౌంటరు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా, ఎన్ని వాయిదాలు తీసుకుంటారని అసహనం వ్యక్తంచేసింది. వీటిపై సోమవారానికల్లా స్పష్టతనివ్వాలని, అన్ని పిటిషన్లపై ఆరోజు విచారణ చేపడతామని తెలిపింది.