15 ఎకరాలు హెటిరో ట్రస్టుకే .. తిరిగి కేటాయించిన ప్రభుత్వం

15 ఎకరాలు హెటిరో ట్రస్టుకే .. తిరిగి కేటాయించిన ప్రభుత్వం
  • ఏడాదికి రూ.2 లక్షల లీజు రూ.5 లక్షలకు పెంపు
  • ఏటా 5 శాతం లీజు పెంచేలా ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: హెటిరో పార్థసారథిరెడ్డి కి చెందిన సాయి సింధు ట్రస్టుకు లీజు రద్దు చేసిన 15 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ సంస్థకే కేటాయించింది. ఈ మేరకు గత నెలలోనే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే లీజు మొత్తాన్ని పెంచింది. అప్పుడు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల లీజు మాత్రమే ఇచ్చేలా ఉండగా.. ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచింది. 

దీంతో 15 ఎకరాలకు ఏడాదికి రూ.75 లక్షలు లీజు రూపంలో ప్రభుత్వానికి రానుంది. ప్రతి ఏడాది 5 శాతం చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా జీవో ఇచ్చారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను జనవరిలో రద్దు చేసింది. దీనిపై సాయి సింధు ఫౌండేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిని పెట్టుకున్నది. 

ఇందులో ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన స్థలంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నదని.. దాదాపు రూ.446 కోట్లు ఖర్చు చేసి విలువైన హాస్పిటల్ ఎక్విప్​మెంట్​ను కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం ఏడాదికి రూ.30 లక్షలు ఉన్న లీజును.. రూ.60 లక్షలు చేయాలని లేదా ప్రభుత్వం రీజనబుల్​గా పెంచాలని కోరారు. ట్రస్టు హాస్పిటల్​లో దాదాపు 7 వేల మందికి ఉపాధి కలుగుతుండటం, ఇప్పటి నిర్మాణలు పూర్తి కావడంతో లీజును పెంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మార్చిలో తిరిగి ఆ భూమిని హెటిరో పార్థసారథి రెడ్డికే 60 ఏండ్లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గత సర్కార్ లీజు కథ ఇలా

అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చిన హైకోర్టు తీర్పును కూడా కాలరాసింది. వాస్తవానికి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కాకముందే.. 2018లోనే ఆయన ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్ పేరిట​అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూదందా నడిపింది. 1989లో  బసవతారకం హాస్పిటల్ కు లీజుకు ఇచ్చిన తరహాలోనే ఏడాదికి కేవలం రూ.50 వేల చొప్పున లీజుకు ఇవ్వాలని, తమ క్యాన్సర్ హాస్సిటల్​లోనూ 25%  మంది ఇన్​పేషెంట్లకు, 40% మంది ఔట్ పేషెంట్లకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని పార్థసారథిరెడ్డి ట్రస్ట్ లెటర్ పెట్టుకుంది. 

దీంతో ఏడాదికి రూ.1.47 లక్షల లీజు చెల్లించేలా.. మూడేండ్లకోసారి 5% పెంచే నిబంధనతో భూమి అప్పగించాలని 2019 జనవరిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ మెమో జారీ చేసింది. జీవో 59ని విడుదల చేసింది. ఈ క్యాన్సర్ హాస్సిటల్ కు భూముల కేటాయింపును సవాల్ చేస్తూ అదే ఏడాది డాక్టర్ ఊర్మిళ పింగ్లే, మరొకరితో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు నాడు ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 60 ఏండ్లలో వేల కోట్ల ఆదాయం వచ్చే స్థలాన్ని తక్కువ రేటుకు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవో 59ను రద్దు చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ జీవో నంబర్‌‌‌‌ 571, జీవో నంబర్‌‌‌‌ 218 ప్రకారం పున: సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పింది. 

అయితే.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు.. జీవోను కోర్టు రద్దు చేసిన రెండు నెలల్లోపే హెటిరోకు అనుకూలంగా ఉండేందుకు ప్రభుత్వ భూముల లీజు నిబంధనలను కూడా బీఆర్ఎస్ సర్కార్ సవరించింది. సవరించిన లీజు నిబంధనల ఆధారంగా 2023 సెప్టెంబర్ 25న సాయిసింధు ఫౌండేషన్ కు అదే భూమిని మళ్లీ కేటాయిస్తూ జీవో 140 జారీ చేసింది. దీని ప్రకారం.. గతంలో ఉన్న ఏడాదికి ఎకరాకు రూ.1.47 లక్షలుగా ఉన్న లీజును రూ.2 లక్షలకు పెంచింది.