- ఈవై కన్సల్టెన్సీ సూచనలపై ఆశలు
భద్రాచలం,వెలుగు : గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భద్రాచలంలో మౌళిక సదుపాయాల కల్పనకు గత నెలలో ఈవై కన్సల్టెన్సీ సర్వే చేపట్టింది. ఈవో దామోదర్‌రావు, ఈఈ రవీందర్‌లతో కలిసి కన్సల్టెన్సీ ప్రతినిధులు భద్రాచలంలోని స్నానఘట్టాలు, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో పర్యటించారు. రాష్ట్ర స్థాయిలో రివ్యూలు కూడా జరిగాయి.
గోదావరి తీరంలో ఉన్న 64 ఆలయాలు, 84 స్నానఘట్టాలల్లో కూడా ఈ ప్రతినిధులు వివరాలు సేకరించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరి తీరంలో ఉన్న చిన్న ఆలయాలు, స్నానఘట్టాల వద్ద భక్తులు పుష్కార స్నానాలు ఆచరిస్తారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు బార్డర్‌గా ఉన్న భద్రాచలానికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
కిందటి సారి కోటి మంది
2015 గోదావరి పుష్కరాలు జులై 30 నుంచి ఆగస్టు 10 వరకు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి తీరంలో స్నానఘట్టాల వద్ద సుమారు కోటి మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో రాబోయే పుష్కరాలకు 2కోట్ల మంది భక్తులు జిల్లాలోని భద్రాచలం, మోతెగడ్డ, పర్ణశాల, దుమ్ముగూడెం, మణుగూరు మండలంలోని చినరావిగూడెం, ఇతర స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
అందుకనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సర్కారు యోచిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఫండ్స్ కేటాయించి మౌళిక వసతులను కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తోంది. ఈవై కన్సల్టెన్సీ ద్వారా అందుకు సూచనలు స్వీకరిస్తోంది.
భద్రాచలంలో 150 మీటర్ల పుష్కరఘాట్
భద్రాచలంలో ప్రస్తుతం 150 మీటర్ల మేర పుష్కరఘాట్ ఉంది. 2027 గోదావరి పుష్కరాలకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో వీటిని మరో 150 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం గణేశ నిమజ్జనాలు జరిపే ప్రాంతం వైపు 75 మీటర్లు, శ్మశాన వాటిక వైపు 75 మీటర్లు పెంచేందుకు దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ సూచించింది.
పిండ ప్రదానాల కోసం ఇప్పుడున్న మందిరానికి తోడుగా మరో మందిరం, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, వృద్ధులు, పిల్లలు గోదావరి వద్దకు రాలేని పరిస్థితుల్లో వారి కోసం షవర్ బాత్‌లు ఏర్పాటుకు సూచనలు ఇచ్చారు. పర్ణశాల, మోతెగడ్డ, చినరావిగూడెంలలో స్నానఘట్టాల వద్ద సౌలత్లు పెంపు ప్రతిపాదనలు కూడా చేశారు.
పుష్కరాల సమయంలో ముక్కోటి, తెప్పోత్సవం ఉత్సవాల అనుభవంతో భక్తులకు ఆలయం చుట్టూ, గోదావరి తీరాన వాటర్ ప్రూఫ్ టెంట్లు, బారికేడింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి వీటిని ఇంకా పెంచాలని యోచిస్తున్నారు.
పరిశీలించారు
ఇటీవలే ఈవై కన్సల్టెన్సీ ప్రతినిధులు భద్రాచలం, పర్ణశాలలో పర్యటించారు. గోదావరి పుష్కరాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సూచనలు స్వీకరించారు. గతంలో చేసిన ఏర్పాట్లు, అనుభవాలు, భక్తులకు ఇంకా ఏమి అవసరమో అడిగి తెలుసుకున్నారు. సూచనలు,ప్రతిపాదనలు చేసినం. వారి సూచనల మేరకు సౌలత్‌ల కల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రవీందర్‌రాజు, ఈఈ
