42% బీసీ కోటా కోసం ప్రత్యేక రైల్లో ఢిల్లీకి..నియోజకవర్గానికి 50 మంది చొప్పున తరలింపు 

42% బీసీ కోటా కోసం ప్రత్యేక రైల్లో ఢిల్లీకి..నియోజకవర్గానికి 50 మంది చొప్పున తరలింపు 
  • 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం, 6న జంతర్‌‌మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం
  • నేటి నుంచి 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర.. 8 నుంచి రెండో విడత 
  • సీఎం రేవంత్‌తో మీనాక్షి, మహేశ్ గౌడ్ భేటీలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకోసం అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీ పరంగా కార్యాచరణను సిద్ధం చేసింది. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ స్టేట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం, జనహిత పాదయాత్ర, పార్టీ నిర్మాణం, నామి నేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు.

బీసీ రిజర్వేషన్ల కోసం వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేది కగా పోరాడాలని.. అందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలించాలని నిర్ణయించారు. తొలుత వచ్చే నెల 5న పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీ ఎంపీల వాయిదా తీర్మానం ఇచ్చి, బీసీ రిజర్వేషన్లపై చర్చకు డిమాండ్ చేస్తారు. 6న జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఇందులో సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. 

రెండు విడతల్లో పాదయాత్ర.. 

ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో జనహిత పాదయాత్రను రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతకుముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే వచ్చే నెల 4 వరకు మొదటి విడత నిర్వహించి, ఢిల్లీ టూర్ తర్వాత 8 నుంచి రెండో విడత కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర వాయిదా పడింది. మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మాత్రం ఈ యాత్ర ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది.

ఆ తర్వాత మళ్లీ వచ్చే నెల 8 నుంచి రెండో విడత యాత్ర సాగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి జనహిత పాదయాత్ర, శ్రమదానం ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఇందులో మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ పాల్గొంటారు. గురువారం పరిగి, శుక్రవారం మెదక్ జిల్లా ఆందోల్, శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లో పాదయాత్ర సాగనుంది