
- గత సర్కారు హయాంలో ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఫోన్ల ట్యాప్
- గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫోన్లు విన్నరు
- సీబీఐకి కేసు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సిట్ దర్యాప్తును పరిశీలించడంతోపాటు సాధ్యాసాధ్యాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
మావోయిస్టుల పేరుతో సామాన్యుల ఫోన్ నంబర్లను అందించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)ను తప్పుదోవ పట్టించడం, కేంద్ర మంత్రులు, జడ్జిలు, గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు అవసరమనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు మాజీ ఐపీఎస్ అధికారి కావడం, విచారణకు సహకరించకపోవడంతో సూత్రధారులను గుర్తించడంలో జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీబీఐకి లేఖ రాసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
రివ్యూకమిటీలు కూడా దుర్వినియోగం
పదవీ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్‌రావును ‘ఫోన్ లీగల్ ఇంటర్‌సెప్షన్‌కు డిజిగ్నేటెడ్ అథారిటీ’గా నియమించడం కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే జరిగినట్లు తెలిసింది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉండేది. గడువు ముగిసిన తర్వాత కూడా ఫోన్లపై నిఘా పెట్టాలంటే మళ్లీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి. కానీ అందుకు విరుద్ధంగా ప్రభాకర్‌రావు టీమ్ ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించి రివ్యూ కమిటీలో ఐపీఎస్ అధికారులు బాధ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంశాఖ సహా రివ్యూ కమిటీలను కూడా దుర్వినియోగం చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేవలం 15 రోజుల లిస్ట్‌లోనే రాజకీయ ప్రముఖులతోపాటు 618 ఫోన్ నంబర్లు ఉండడంతో.. మొత్తం వ్యవహారంలో ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలను రాబట్టాలంటే సీబీఐ దర్యాప్తు అవసరం అనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
బాధితుల్లో ప్రముఖులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు నేతృత్వంలో మాజీ అడిషనల్ ఎస్పీ ప్రణీత్‌రావు టీమ్ అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసింది. దేశభద్రతకు భంగం కలిగించే విధంగా ట్రాయ్‌కు తప్పుడు సమాచారం అందించారు. త్రిపుర గవర్నర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించారు.
వీరితోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బేరర్లుసహా ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి మధ్య జరిగిన సంభాషణలు విన్నట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ మేరకు బండి సంజయ్సహా రాష్ట్ర బీజేపీ కార్యాలయ ఆఫీస్ బేరర్ల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డ్ చేసింది.