
- తిరిగి పంపించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- గత సర్కారు నిర్లక్ష్యంతో డీపీఆర్‌ను వెనక్కి పంపిన సీడబ్ల్యూసీ
- నీటి కేటాయింపులపై 2023లోనే బీఆర్‌ఎస్ సర్కారుకు సీడబ్ల్యూసీ లేఖ
- స్పందన లేక నిరుడు డిసెంబర్‌లో అప్రైజల్ లిస్టు నుంచి తొలగింపు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ను మరోసారి సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కి సమర్పించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. శుక్రవారం జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్, ఎన్జీటీలోని కేసులు, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. గురువారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఉత్తమ్.. శుక్రవారం మీటింగ్‌లో ప్రాజెక్టు డీపీఆర్‌పై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు కేటాయింపులు, వివరణలతో వెంటనే సీడబ్ల్యూసీకి మరోసారి డీపీఆర్‌ను పంపాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
గత సర్కారు నిర్లక్ష్యంతో వాపస్..
నీటి కేటాయింపులపై స్పష్టత లేదని పేర్కొంటూ నిరుడు డిసెంబర్‌లో సీడబ్ల్యూసీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కు పంపింది. దాంతో పాటు కాస్ట్ బెనిఫిట్ రేషియో సరిగా లేదని పేర్కొంటూ కాళేశ్వరం మూడో టీఎంసీ, మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్తూ వార్ధా డీపీఆర్‌లనూ తిప్పి పంపింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ డీపీఆర్‌ను తిప్పి పంపిస్తామని2023 ఏప్రిల్‌లోనే గత బీఆర్ఎస్ సర్కారుకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ప్రాజెక్టు నీటి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని సూచించింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా 45.66 టీఎంసీలను పొదుపు చేసి వాడుకుంటామని చెప్తున్నా.. ఆ నీటిని ఎలా పొదుపు చేస్తారో వివరాలు లేవని, ఆ వివరాలు ఇవ్వాలని ఆనాడే సీడబ్ల్యూసీ బీఆర్ఎస్ సర్కారుకు సూచించింది.
ఇటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను వాడుకుంటామని పేర్కొన్నా.. దానిపై ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తున్నదని సీడబ్ల్యూసీ నాడు లేఖలో పేర్కొంది. కానీ, అప్పటి బీఆర్ఎస్ సర్కారు మాత్రం సీడబ్ల్యూసీ లేఖను పట్టించుకోలేదు. ఫలితంగా 2024 డిసెంబర్‌లో అవే కారణాలను చూపుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపింది. ప్రాజెక్ట్ అప్రైజల్ లిస్టు నుంచి తొలగించింది. దీంతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు.. వీలైనంత త్వరగా మరోసారి డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపించి 90 టీఎంసీలకు అనుమతులు తెచ్చుకోవాలని కసరత్తులు చేస్తున్నది.