అభయహస్తం రద్దు..డబ్బులు వాపస్ ఇయ్యని సర్కార్

అభయహస్తం రద్దు..డబ్బులు వాపస్ ఇయ్యని సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభయ హస్తం పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. డ్వాక్రా మహిళలు చెల్లించిన వాటా ధనాన్ని తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. 2020 మార్చి 15న పథకం రద్దు సందర్భంగా ఆ స్కీం లబ్ధిదారుల్లోని అర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తామని, అర్హులు కానివారికి స్కీం కోసం కట్టిన డబ్బును వాపస్ చేస్తామని అసెంబ్లీలో చెప్పింది. కానీ రెండున్నరేండ్లయినా డబ్బులు వాపస్ చేయడం లేదు. దీంతో అభయ హస్తం స్కీం ఆగిపోయి.. ఆసరా పెన్షన్ రాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

సీఎం జిల్లాలో మాత్రమే చెల్లింపు

అభయ హస్తం పైసలు మహిళల ఖాతాల్లో జమ చేసే అంశంపై కొద్ది రోజుల కింద మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావు, మల్లారెడ్డి అసెంబ్లీలో సమీక్షించారు. రెండు, మూడ్రోజుల్లో పడతాయన్న పైసలు 2 నెలలు దాటినా జమ కాలేదు. ఎట్టకేలకు మే 31న రూ.401 కోట్ల విడుదలకు అనుమతులిస్తూ జీవో ఇచ్చింది. అయితే ఆ డబ్బులు కేవలం సిద్దిపేట జిల్లాకు చెందిన సభ్యులకు మాత్రమే ఇచ్చారు. మిగతా జిల్లాల మహిళలకు ఒక్క పైసా జమ చేయలేదు.

1,500 కోట్లు దేనికి మళ్లించారు?

అభయహస్తం స్కీమ్‌‌‌‌‌‌‌‌లో 23,28,014 మంది సభ్యులుగా చేరారు. వీరిలో రాష్ట్ర ఏర్పాటు నాటికి 2.20 లక్షల మంది అభయ హస్తం పెన్షన్ తీసుకునేవారు. ఈ స్కీమ్ ప్రకారం సభ్యులు రోజుకో రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 కడితే... ప్రభుత్వం అంతే మొత్తం జమ చేస్తుండేది. ఇలా రాష్ట్రంలో రూ.1,500 కోట్లు జమ అయినట్లు అంచనా. ఈ డబ్బులు ఎల్ఐసీ వద్ద ఉన్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆసరా పరిధిలోకి వచ్చే మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తామని, ఈ స్కీమ్ పరిధిలోకి రానోళ్లకు డబ్బులు వాపస్ ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్ఐసీ వద్ద ఉన్న డబ్బులను క్లెయిమ్‌‌‌‌ చేసిన ప్రభుత్వం.. ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజా ప్రతినిధులపై మహిళల ఆగ్రహం

60 ఏండ్లకు పెన్షన్ వస్తుందని ఏడేనిమిదేండ్లు ప్రీమియం కడితే.. స్కీం రద్దుతో పెన్షన్ రాకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తకు వచ్చే పెన్షన్​తో సంబంధం లేకుండా తమకు ఆసరా స్కీమ్ వర్తింపజేయాలని కోరుతున్నారు. తమకు రావాల్సిన డబ్బులు వాపస్ చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఈ నెల 25న నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో బతుకమ్మ చీరల పంపిణీకి హాజరైన ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని నిలదీశారు. పింఛన్లు అందడం లేదని.. చెల్లించిన డబ్బులైనా ఇప్పించాలని అడిగారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావుకు ఇదే నిరసన ఎదురైంది.

స్కీం రద్దుతో నష్టపోయిన మహిళలు

అభయ హస్తంలో చేరిన సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున నాలుగేళ్ల పాటు (9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్‌‌‌‌ఐసీ నుంచి ఉపకార వేతనం లభించేది. సభ్యులకు 60 ఏండ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను వచ్చేది. ఒకవేళ ప్రమాద వశాత్తు సభ్యురాలు మరణించినా, శాశ్వత అంగవైక్యలం కలిగినా రూ.75 వేల బీమా అందేది. సభ్యురాలు లేదా సభ్యురాలి భర్త సహజ మరణానికి కూడా రూ.30 వేల బీమా లభించేది. స్కీమ్ రద్దుతో ఇలాంటి ప్రయోజనాలు లేకుండా పోయాయి.