ఢిల్లీలో మొన్న కర్నాటక.. నిన్న కేరళ, తమిళనాడు

ఢిల్లీలో మొన్న కర్నాటక.. నిన్న కేరళ, తమిళనాడు
  • కేంద్రంపై ప్రతిపక్షాల పోరాటం
  • రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు ఇస్తలేదు: కేజ్రీవాల్
  • కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతిన్నది: పినరయి

న్యూఢిలీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. బుధవారం ఢిల్లీలోని జంతర్  మంతర్  వద్ద కర్నాటక సీఎం, కాంగ్రెస్  నేతలు ధర్నా చేయగా.. గురువారం కేరళ, తమిళనాడు రూలింగ్  పార్టీల నేతలు ఆందోళన చేశారు. ఆప్  కూడా వారికి  సంఘీభావం తెలిపింది. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జనరల్  సెక్రటరీ సీతారాం ఏచూరి, తమిళనాడు మంత్రి పళనివేల్  త్యాగరాజన్, ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్, పంజాబ్  సీఎం భగవంత్  మాన్, నేషనల్  కాన్ఫరెన్స్  చీఫ్​ ఫరూక్  అబ్దుల్లా, ఎల్డీఎఫ్​ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లెఫ్ట్ ఫ్రంట్  లీడర్లు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్  మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చాలినన్ని నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా కుట్రపన్నుతోందని విమర్శించారు.

కేంద్ర సంస్థలు, గవర్నర్లను ఉసిగొల్పి రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లో వేలు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. ‘‘గవర్నర్లు, లెఫ్టినెంట్  గవర్నర్లను ఉసిగొల్పి రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటున్నది. నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి? రెండు కోట్ల ఢిల్లీ పౌరుల హక్కుల కోసం మేము ఈరోజు పోరాడుతున్నాం. ప్రజల హక్కులను కాలరాసే హక్కు కేంద్రానికి లేదు. కేంద్రానికి ఢిల్లీ ప్రజలు పన్నుల రూపంలో ఏడాదికి రూ.2 లక్షల కోట్లు చెల్లిస్తే, వారికి రూ.325 కోట్లు మాత్రమే దక్కుతున్నాయి. ఇలా ఉంటే రోడ్లు ఎలా కడతం? కరెంటు ఎలా సప్లై చేస్తం? బ్రిటిషర్ల కన్నా ఘోరంగా దేశ ప్రజలను కేంద్రం దోపిడీ చేస్తోంది” అని కేజ్రీవాల్  వ్యాఖ్యానించారు. 

రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది..

కేంద్రం తన అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను హరిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్  ఆరోపించారు. సమాఖ్య నిర్మాణాన్ని కాపాడేందుకే కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగామని తెలిపారు. కేంద్రం అనాలోచిత చర్యలు దేశంలోని సహకార, సమాఖ్య స్ఫూర్తిని బలహీనపర్చాయని పినరయి మండిపడ్డారు.