- అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ స్కీం ప్రారంభానికి ఏర్పాట్లు
- రూ. 100 కోట్ల కేటాయింపు.. 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి
- జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
- 9న అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో భారీ కిసాన్ మేళా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సన్న, చిన్నకారు, మహిళా రైతులతో పాటు అన్ని వర్గాల రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ యాంత్రీకరణ స్కీంను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ స్కీంను బీఆర్ఎస్ సర్కార్ క్లోజ్ చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ స్కీంతో పాటు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఈ నెల 9న ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ కిసాన్ మేళాను ఏర్పాటు చేయనున్నారు.
యాంత్రీకరణ స్కీంతో రైతుల పాలిట వరం
రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇచ్చే స్కీంను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల కిందట క్లోజ్ చేసినప్పుడు రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. వ్యవసాయంలో కూలీల కొరతను యంత్రాలు చాలా వరకు తీర్చనున్నాయి.
రూ. 100 కోట్లతో...!
వ్యవసాయ యాంత్రీకరణ స్కీంను ఈ నెల 9న అశ్వారావుపేటలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 100 కోట్లతో ఈ స్కీంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. వరి కోత యంత్రాలు, కలుపు మొక్కలు, విత్తనాలు, ఎరువులు కలిపి వేసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటా వేటర్స్, బ్యాడరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, మైజ్ షెల్లర్స్, పవర్ వీడర్తో పాటు ట్రాక్టర్లను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
సబ్సిడీతో పంపిణీ..
సన్న, చిన్న కారు, మహిళా రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీతో యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు గానూ రూ. వంద కోట్లతో 1,30,563 మంది రైతులకు సబ్సిడీతో యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 4.59కోట్లతో 350 యూనిట్లను రైతులకు అందించనుంది. ఇందుకు గానూ ఇప్పటికే మండల స్థాయిలో అర్హులైన రైతుల ఎంపిక పూర్తి కావొచ్చింది.
9న మెగా కిసాన్ మేళా..
ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రీకరణ స్కీం అమలుకు అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ వేదిక కానుంది. ఈనెల 9న ఆయా స్కీంలను అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న మెగా కిసాన్ మేళ రైతులకు ఎంతో మేలు కలుగనున్నదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈ ప్రోగ్రాంలో దాదాపు 2వేల మంది రైతులు పాల్గొనేలా ఆఫీసర్లు కృషి చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట...
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం అమలును ఈ నెల 9వ తేదీన అశ్వారావుపేటలో ప్రభుత్వం ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో దాదాపు 300పైగా క్లస్టర్లలో ఈ పథకం అమలు కానుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 15క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా ఈ స్కీం అమలు కానుంది.
అశ్వారావుపేట, పాల్వంచ, సుజాతనగర్, జూలూరుపాడు, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని 1,875 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని మొదటి దశలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. 1.875 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ స్కీంలో భాగస్వామ్యం కానున్నారు. భూ సార, శత్రు పురుగులు, తెగుళ్ల యాజమాన్యాలతో పాటు, పంట పెరుగుదల–అధిక దిగుబడి, జీవ నియంత్రణ పద్దతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
