ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
  • బహుమతులు అందజేసిన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్

మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేన్ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి  జరిగిన యూనిక్స్ సన్ రైజ్ పదో రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. మంచిర్యాలలోని గ్రీన్ సిటీలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన మెన్స్, అండ్​ విమెన్స్​ సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్ ఫైనల్​ పోటీలు హోరాహోరీగా ముగిశాయి.

చీఫ్​ గెస్ట్​గా హాజరైన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ విన్నర్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడినవారు మళ్లీ ప్రయత్నాన్ని  ఆపొద్దని సూచించారు. అంతకుముందు శ్రీరాంపూర్ సింగరేణి జీఎం సంజీవరెడ్డి టాస్ వేసి మ్యాచ్​లను ప్రారంభించారు. మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. టోర్నమెంట్ ఆర్గనైజ్ కమిటీని అభినందించారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ.. పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 224 మంది  క్రీడాకారులు పాల్గొన్నారని, టోర్నీ రన్నర్స్, విన్నెర్స్ సౌత్ జోన్, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భాస్కర్ల వాసు, బండ మీనారెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మధు, రమేశ్ రెడ్డి, కార్యవర్గ సభ్యుల కృషి వల్ల టోర్నీ సక్సెస్​ఫుల్ ​అయ్యిందని కొనియాడారు.