హనుమకొండ, వెలుగు: రైతులకు సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ ముస్తాబైంది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు సాగులో మెలకువలు నేర్పించేలా ప్రభుత్వం ఈ మెగా రైతు మేళాను ఏర్పాటు చేసింది.
అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, తదితర అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ మెగా రైతు మేళా నిర్వహిస్తుండగా, సోమవారం ఆర్అండ్ బీ ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
