రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి: బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి

రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి: బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి
  • రాష్ట్రపతి ప్రసంగంలో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ
  • ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
  • ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో వెళ్తున్నామని వ్యాఖ్య
  • దేశంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్న ముర్ము
  • ప్రపంచం మెచ్చేలా అయోధ్యలో రామాలయం నిర్మాణం

ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనకు వచ్చింది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. తెలంగాణలో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశామని అన్నారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. అందుకు తగినట్లు టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చాం. రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి. కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించుకున్నాం. భగవాన్ బిర్సాముండా జన్మదిన్నాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకుంటున్నాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. సూర్యుడిపై ప్రయోగాల్లో భాగంగా ఆదిత్య ఎల్ - 1 మిషన్ విజయవంతం అయింది." అన్నారు.  

ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ముందుకు సాగుతున్నామని, వికసిత భారతావనిని నిర్మించే పనిలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించామని చెప్పారు. తమ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చూస్తోందని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనంలో తనది తొలి ప్రసంగమన్నారు.  

"దేశంలో లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించడంతో చట్ట సభల్లోవారి ప్రాతినిధ్యం 33 శాతం పెరుగుతుంది.”అని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని ఆటంకాలు అధిగమించి.. ప్రపంచమే మెచ్చేలా రాములవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు.