ఈటల రాజీనామా.. సాధిస్తున్న విజయాలెన్నో

ఈటల రాజీనామా.. సాధిస్తున్న విజయాలెన్నో

ఈటల రాజేందర్​ మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయడం సీఎం కేసీఆర్ పై సాధించిన విజయం. ఈటల రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయి. రాజకీయ ప్రాధాన్యతలు మారిపోయాయి. టీఆర్ఎస్ పూర్తిగా ఉద్యమ స్వభావం కోల్పోయి పచ్చి అవకాశవాద రాజకీయాలకు దిగజారిపోయింది. ఆ ఒక్క సీటు గెలవకపోవడం వల్ల ప్రభుత్వం ఏమీ పడిపోదు. అయినా టీఆర్ఎస్​ పార్టీ విలువలకు మంగళం పాడింది. ఇప్పటికే ఈటల తన రాజీనామాతో చాలా విజయాలు సాధించారు. చరిత్రను బద్దలు కొట్టి ఆయన కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.

ఈటల రాజేందర్​ రాజీనామా సాధిస్తున్న విజయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈటల వదిలిన బాణాలకు టీఆర్ఎస్ అధిష్టానం విలవిల్లాడుతున్నది. 57 ఏండ్లకే ఆసరా పెన్షన్ ఇస్తామన్న మాట ఏమైంది అని ఈటల ప్రశ్నించడంతో.. ఆ హామీకి ఇప్పుడు కేబినెట్​ ఆమోదం లభించి అమలులోకి వస్తున్నది. దీని ద్వారా ఆరున్నర లక్షల మంది లబ్ధి పొందనున్నారు. భూస్వాములకు రైతుబంధు ఎందుకని, కౌలుదారు, అనుభవదారు కాలం ఎందుకు తీసేశారని ఈటల ప్రశ్నించారు. 1977 నుంచి ఉద్యమాలతో ఆక్రమించి రాళ్లు రప్పలు ఏరిపారేసి చక్కని పంట భూములుగా మార్చుకున్న లక్షలాది ఎకరాలను అనుభవదారుల నుంచి తిరిగి భూస్వాములకు, వెలమ, రెడ్డి ఆసాములకు రైతుబంధు పేరిట అయాచితంగా అప్పగించి పేదల నోళ్లు కొట్టారన్నారు. ఇక టీఆర్ఎస్​ సర్కారు దళిత ద్రోహి అని ఎందరో విమర్శించారు. దానికి జవాబుగా ఇప్పుడు దళిత బంధు ఆలోచన చేశారు. ఈటల కొత్త రేషన్ కార్డులేవి అంటే.. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది. ఇలా ఒకటెనుక ఒకటి ఈటల సాధిస్తున్న విజయాలు చూస్తుంటే.. ఈటల ఇంత బలవంతుడా అని దేశమే ఆశ్చర్యపోతున్నది. 
హరీశ్​ కూడా చేతులెత్తేయడం వల్లే దళితబంధు
18 ఏండ్లుగా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ప్రజల హృదయాల్లో ఎంత స్థానం సంపాదించుకున్నారో బరిలోకి దిగేదాకా అధిష్టానానికి తెలిసి రాలేదు. కేసీఆర్ తాపకో నియోజకవర్గం మార్చి గెలిచి రావడం వల్ల ఆయనకు దీని గాఢత తెలియదు. హరీశ్ రావుకు కొంత తెలుసు. హరీశ్ చలవ వల్లనే కేసీఆర్ గెలుస్తుంటారని కొందరికే తెలుసు. తెలంగాణ ఉద్యమ విజయంలో రసమయి బాలకిషన్ ఎంతో.. రాజకీయాల విజయంలో హరీశ్ రావు అలాంటివాడు. అలాంటి హరీశ్​ రావు కూడా ఈటల రాజేందర్​విషయంలో చేతులెత్తేశాక దళిత బంధు పథకం ముందుకు తెచ్చింది టీఆర్ఎస్​ అధిష్టానం. దళిత బంధు పథకానికి కేటాయిస్తున్న నిధులు.. గతంలో ఎస్సీ సబ్​ ప్లాన్​కు కేటాయించి దారి మళ్లించినవే తప్ప కొత్తవి కాదని గుర్తుంచుకోవాలి. 
గెలుపు కోసం దిగజారిపోయింది
ఎన్నికల్లో గెలుపు వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్, సీఎం కేసీఆర్​లను మించిపోయి గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు సంపాదించడం కూడా ఈటల సాధించిన విజయాల్లో ఒకటే. ఇరవై ఏండ్లుగా పార్టీ కోసం, ఉద్యమం కోసం పని చేస్తున్న వాళ్లు చూస్తుండగానే గద్ద తన్నుకుపోయినట్టు ఎమ్మెల్సీ సీటును కౌశిక్​రెడ్డి తన్నుకుపోయారు. ఇది కేసీఆర్ పై, టీఆర్ఎస్ సీనియర్లపై కౌశిక్ రెడ్డి సాధించిన విజయం. స్పష్టంగా ఇది కేసీఆర్​ ఓటమి. ఇరవై ఏండ్లుగా వెన్నంటి ఉండి పని చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, దేశపతి శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ, వి.ప్రకాశ్​ వంటి వారు ఉండగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ఈటల విజయమే. టీఆర్ఎస్ అన్ని విలువలు కోల్పోయి గెలుపు కోసం ఎంతగా దిగజారుతుందో స్పష్టం చేసుకున్నారు.
చరిత్రహీనుల జాబితాలో చేరిపోతారు
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే మాట తప్పను అంటారు. కానీ, ఎన్ని హామీలు ఇచ్చి మాట తప్పారో లెక్కేలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో ప్రకటించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ ధైర్యమంతా ఎక్కడికి పోయిందో! అంతకు ముందు రాజీనామాలంటే ఎంతో ఉత్సాహపడేవారు. ఇప్పుడు ఈటలలా రాజీనామా చేసి దళితుడిని ఇప్పటికైనా ముఖ్యమంత్రిని చేయలేకపోతున్న బలహీనుడిగా మారిపోయారు. పదవి, అధికార వ్యామోహం కేసీఆర్​ను పట్టి పీడిస్తున్నాయి. తద్వారా పదవిలో ఉండవచ్చేమో గానీ చరిత్రహీనుల జాబితాలోకి జారిపోతున్నారని గమనించడం లేదు. ఇప్పటికే సెక్రటేరియట్ ముఖం చూడని ముఖ్యమంత్రి అని చరిత్ర కెక్కారు. సెక్రటేరియట్ చూడని సీఎం, ప్రజలకు, చివరకు ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా అపకీర్తి మూటగట్టు కున్నారు. స్కూలుకు పోకుండా హెడ్ మాస్టర్ ఇంట్లో ఉండి బడి నడిపిస్తే అది ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెడ్ మాస్టర్ స్కూలుకు రాకుండా ఇంటి నుంచి పని నడిపిస్తే స్కూలు పిల్లలకు, టీచర్లకు, ఆ ఊరి ప్రజలకు ఇచ్చే సందేశం అరాచక, అస్తవ్యస్థ పరిపాలనే. నినాదాలు, కొత్త కొత్త పేర్లతో పథకాల వల్ల ప్రజల ఓట్లు పడవచ్చేమో గానీ ప్రభుత్వం మాత్రం నడవదు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, హైదరాబాద్ వరద బాధితుల్లో తమను పరామర్శించని ముఖ్యమంత్రికి, తమని కలవడానికి ఇచ్చగించని మనిషికి ఎందుకు ఓటేయాలనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. 

తక్కువ అంచనా వేస్తే దెబ్బ తప్పదు
మొదటిసారిగా తన అనుచరుడి బలమెంతో గోదాలోకి దిగిన తర్వాతగానీ టీఆర్ఎస్​ అధిష్టానానికి తెలిసి రాలేదు. వినయంగా ఉండే మనిషిని తక్కువ అంచనా వేసే రోగం ఆధిపత్యంలో ఉండే వారికి ఉంటే ఇలాగే దెబ్బతింటారు. ఒక రాజ్యసభ సీటు ఇమ్మంటే పోపో అనడంతో ముందుకు సాగి ముఖ్యమంత్రి అయి దేశ రాజకీయాలనే మలుపు తిప్పారు ఎన్టీఆర్. ఈటలతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మలుపులు తిరుగుతున్నాయి. రేపు దేశ రాజకీయాలు కూడా ఈటలతో ఏ మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు. ఈటల అనుచరుడు బండ శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ పదవి ఈటల చలవే. ఎల్.రమణకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ అన్న ప్రచారం కూడా ఈటల వల్లనే. ఫామ్​ హౌస్, ప్రగతిభవన్ గేట్లు దాటి సీఎం కేసీఆర్  జనంలోకి రావడానికి కూడా ఆయనే కారణం. ఏడేండ్ల తర్వాతైనా రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ కు ముఖ్యమంత్రిగా కేసీఆర్​ మొదటిసారి పూల దండ వేయడం ఈటల చలువే. ఇలా ఈటల రాజీనామా ఎన్నో విజయాలు సాధిస్తున్నది.
ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె
రాష్ట్ర పరిపాలన నినాదాల మీద నడవదు. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేస్తే ఆమె ప్రాధాన్యత ఏమైనా తగ్గిందా? ఏడేండ్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత కూడా మోజు తీరలేదా? మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడైనా రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే మాటకు కట్టుబడి ఉంటారని జనం నమ్ముతారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్న దళితులు, విద్యావంతులు ఎందరో ఉన్నారు. కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, ఘంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గద్దర్, గోరటి వెంకన్న, మందకృష్ణ మాదిగ వంటి ఎందరో తమను తాము నిరూపించుకున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ రాజీనామా చేసి.. తనకు పదవీ వ్యామోహం లేదని, అది కాలి చెప్పుతో సమానమని అన్నమాటను, తనకు పుత్ర వ్యామోహం కూడా లేదని నిరూపించుకోవాలి.
 - బీఎస్ రాములు, సామాజిక తత్వవేత్త