వడ్లు వస్తున్నయ్‌ కొనేటోళ్లు లేరు .. రోడ్లపైనే ఆరబోత

వడ్లు వస్తున్నయ్‌ కొనేటోళ్లు లేరు .. రోడ్లపైనే ఆరబోత
  • రోడ్లపైనే వడ్ల ఆరబోత.. ఈలోపు అకాల వర్షాలు పడితే ఆగమైతమని రైతుల ఆవేదన
  • ఈసారి కోటి 65 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో వరి కోతలు జోరందుకున్నాయి. పలు జిల్లాల్లో వరి కోతలు పూర్తయి ధాన్యం చేతికి వస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్‌ అయ్యాయి. మిషన్లతో పొలాలు కోయించిన రైతులు.. వడ్లను రోడ్ల మీద ఆరబోస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా మార్కెట్ యార్డుకు తరలించి అక్కడే ఎండబోస్తున్నారు. అయితే, రాష్ట్ర సర్కార్ మాత్రం ఇప్పటివరకు వడ్ల కొనుగోలు సెంటర్లు తెరవలేదు. 

దీంతో రైతులు గోస పడుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాలు, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని కురవి, మరిపెడ, తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట తదితర మండలాల్లో వరి పొలాలు కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని నకిరేకల్‌‌‌‌, తుంగతుర్తి, అర్వపల్లి, పెద్ద నెమల, వెలుగుపల్లి, కొత్తగూడెం, బిక్కుమల్ల, తిరుమలగిరి, కొడకండ్ల తదితర ప్రాంతాల్లో పంట చేతికి వచ్చింది. మరోవైపు, సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖ కొనుగోలు సెంటర్లు తెరవకపోవడంతో పలు జిల్లాల్లోని రైతులు వ్యాపారులకు, మిలర్లకు అమ్ముకుంటున్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లోని రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు.

సర్కారు కొనుగోళ్లు షురూ చేస్తే ట్రాక్టర్‌‌‌‌ కిరాయి అయినా తగ్గుతదని రైతులు అంటున్నారు. మిల్లర్ల దగ్గరకు తీసుకుపోయితే వాళ్లు కొనే వరకు ట్రాక్లర్లలో లోడ్‌‌‌‌ వేసుకొని, ఎదురు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈలోపు అకాల వర్షాలు పడితే, పంట మొత్తం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌‌‌‌‌‌‌‌కు పంటను అమ్మితే కరెక్ట్ టైమ్‌‌‌‌కు పైసలు వస్తాయని, మిల్లర్లకు అమ్ముతుంటే డబ్బులు ఇచ్చేందుకు వాయిదాలు పెడుతున్నారని అంటున్నారు.

మొదలు కాని కొనుగోళ్ల కార్యాచరణ.. 

రాష్ట్రంలో వరి కోతలు షురూ అయినా వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కార్యాచరణను సివిల్ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇంకా సిద్ధం చేయలేదు. కొనుగోలు సెంటర్లపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రణాళికలు ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సీజన్‌‌‌‌లో లక్షల టన్నుల ధాన్యం మార్కెట్‌‌‌‌ వచ్చే అవకాశాలు ఉండటంతో, అందుకు అనుగుణంగా కనుగోలు సెంటర్లు, రవాణాకు అవసరమైన లారీలు, గన్నీ బ్యాగుల వంటి వాటికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

దీనిపై సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో, చాలా మంది రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంట చేతికొచ్చిన జిల్లాల్లో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తే, తమకు మద్దతు ధర దక్కే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు దాదాపు రూ.20 వేల కోట్లు అవసరం అవుతాయి. సివిల్ సప్లయ్స్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే కొనుగోళ్లు షురూ అవుతాయి. అయితే, వడ్ల కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తామనే దానిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 

ఈసారి రికార్డు స్థాయిలో సాగు.. 

ఈ వానాకాలం సీజన్‌‌‌‌ లేటవడంతో వేరే పంటల సాగు చేసే గడువు మించి పోయింది. దీంతో రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఎకరాలకు పైగా వరి నాట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కోటి 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల అవసరాలు, మిల్లర్లు, ప్రైవేట్ కొనుగోళ్లు పోను సర్కారు నిర్వహించే కొనుగోలు సెంటర్లకు కోటి టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉంది.