అవినీతి, భూకబ్జాలు వెల్లడిస్తే.. బీఆర్‍ఎస్‍ నేతలు బయటతిరగలేరు: కడియం

అవినీతి, భూకబ్జాలు వెల్లడిస్తే.. బీఆర్‍ఎస్‍ నేతలు బయటతిరగలేరు: కడియం

 

  • ఎర్రబెల్లి.. అహంకారం, బలుపు తగ్గించుకో: కడియం శ్రీహరి 
  • దోపిడీ నిరూపించకుంటే.. పల్లాను జనగామ చౌరస్తాలో బట్టలూడదీసి నిలబెడతం
  • మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని వెల్లడి

వరంగల్‍, వెలుగు: వరంగల్​ జిల్లాలో బీఆర్‍ఎస్‍ నేతలు పాల్పడ్డ అవినీతి, భూకబ్జాలను బయటపెడితే.. ఒక్కరు కూడా బయటతిరగలేరని స్టేషన్‍ ఘన్​పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వార్నింగ్​ఇచ్చారు. చాలా మంది పార్టీ మారుతున్నా.. తనను మాత్రమే టార్గెట్‍ చేసినట్లు తెలిపారు. మంగళవారం తన కూతురు, కాంగ్రెస్‍ పార్టీ వరంగల్‍ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి హనుమకొండలోని నివాసంలో ప్రెస్​మీట్ నిర్వహించారు. శ్రీహరి మాట్లాడుతూ.. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. ‘మనుమరాలు వయసున్న యువతి చేతిలో ఓడినవ్‍.. సిగ్గులేదా దయాకర్‍రావు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన అహంకారం, బలుపు మాటలు తగ్గించుకోవాలన్నారు. జిల్లాలో బీఆర్‍ఎస్‍ పార్టీ ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం పల్లా రాజేశ్వర్‍రెడ్డి అని ఆరోపించారు. ‘‘నా దోపిడీని బయటపెడ్తానని పల్లా అంటున్నాడు. నిరూపించకపోతే అతని బట్టలూడాదీసి జనగామ చౌరస్తాలో నిలబెడతం’’ అని హెచ్చరించారు. బీఆర్‍ఎస్‍ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని తాను హైకమాండ్‍ కు ఎప్పుడో చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదిగినకొద్ది బీఆర్‍ఎస్‍ పార్టీ మునుగుతుందని చెప్పారు. కేసీఆర్​పై విమర్శలు చేయనని తెలిపారు. మానకొండూర్‍ ఓటర్లు పండబెట్టి తొక్కితే రసమయికి పేగులు బయటకువచ్చాయని, 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయి సిగ్గులేకుండా నా ఇంటిముందర చావు డప్పు కొడతానని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

తాను ఎవరినీ అణగదొక్కలేదని.. అవకాశాలే వెతుక్కుంటూ వచ్చాయన్నారు. అడగకుండానే ఎన్‍టీఆర్‍ మంత్రిని చేస్తే.. ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్‍ డిప్యూటీ సీఎం చేశారన్నారు. తాటికొండ రాజయ్య రెండు నెలలు తిరిగినా కాంగ్రెస్‍ పట్టించుకోలేదని.. కాంగ్రెస్‍ పార్టీలోనూ ఏఐసీసీ, పీసీసీ తనను ఆహ్వానించి తన కూతురుకు ఎంపీ టిక్కెట్‍ ఇచ్చినట్లు చెప్పారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంద కృష్ణ మాదిగకు తాను లేకుంటే ఉనికే లేదన్నారు. 30 ఏళ్లు దండోరా ఉద్యమంలో తాను ఉన్నట్లు చెప్పారు. ఆర్థికంగా మంద కృష్ణకు సహకారం అందించానన్నారు. ‘‘నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తే ఎన్నిఓట్లు వచ్చాయో ప్రజలకు తెలుసు’’ అంటూ ఎద్దేవా చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలే ప్రత్యక్షంగా తనకు చివరి ఎన్నికలు కావొచ్చని.. మరోసారి పోటీ చేయకపోవచ్చని వెల్లడించారు. పార్లమెంట్‍ ఎన్నికల్లో కడియం కావ్యను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.