కట్టు దాటనంటూనే.. ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్లు

కట్టు దాటనంటూనే.. ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్లు
  • కాంగ్రెస్ లేదా బీఎస్పీ నుంచి పోటీ అంటూ ఊహాగానాలు
  • మాదిగలను ఏకం చేసేందుకు తాటికొండ కసరత్తు
  • మాదిగ బిడ్డనే గెలిపించాలని ఘన్​పూర్​లో మందకృష్ణ మీటింగ్​

జనగామ, వెలుగు:స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కట్టుదాటనంటూనే రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ గీసిన గీత దాటనంటూనే స్టేషన్ అభ్యర్థి కడియంపై పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. రాశి పోసిన కుప్పపై కూర్చుంట అంటే ఊరుకుంటన.. రెండు మూడు రోజుల్లో మనం అనుకున్నది కాబోతుందంటూ తన అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు. కేసీఆర్ టికెట్ల ఖరారు మరుసటి రోజు నుంచి రాజయ్య చేస్తున్న కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. రాజయ్య పార్టీ మారుతారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

ఏదైనా జరగొచ్చు..

వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాటికొండ రాజయ్యకు ఈసారి సీఎం కేసీఆర్ హ్యాండిచ్చారు.  జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా పాలకుర్తి మినహా స్టేషన్​ ఘన్​పూర్​, జనగామలలో బీఆర్​ఎస్​ క్యాడర్​ డైలమాలో ఉంది. టికెట్ పెండింగ్ తో జనగామ క్యాడర్, కడియంకు టికెట్​తో రాజయ్య అనుచరులు ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకు ముందు ఉద్యమ నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరిన రాజయ్య, కడియం శ్రీహరి ఏనాడు సఖ్యతతో లేరు.

రెండు టర్మ్​లుగా స్టేషన్ ఎమ్మెల్యే టికెట్ కోసం కడియం తీవ్ర ప్రయత్నాలు చేసి ఈ సారి సాధించారు. దీంతో రాజయ్యకు పాలుపోని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం క్యాంప్ ఆఫీస్ లో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. అదే రోజు హైకమాండ్ నిర్ణయం శిరోధార్యం అని చెప్పిన రాజయ్య.. ఆ తర్వాత నడుచుకుంటున్న తీరుకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఏదైనా జరగొచ్చని రాజయ్య చెబుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు.

రెండు పార్టీల పై కన్ను

కడియంకు బీఆర్ఎస్ టికెట్ ఖారారైనందున ఇక బరిలో నిలువాలంటే రాజయ్యకు ఇతర పార్టీలే ఆప్షన్​గా మారాయి. కాంగ్రెస్​ నుంచి రంగంలోకి దిగాలని అనుకుంటున్నట్లు చర్చలు స్టార్ట్ అయ్యాయి. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో టచ్ లో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉద్యమ టైంలో రాజయ్య కాంగ్రెస్ పార్టీ వీడిన రాజయ్య మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజయ్యకు అండగా ఉంటామని ఇదివరకే ప్రకటించారు. ఆయన కోరితే పార్టీ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్​ నుంచి వీలుకాకుంటే బీఎస్పీ నుంచైనా పోటీ చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది.

కులాన్ని కూడగట్టే పనిలో..

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మాదిగల ఓట్లే అధికంగా ఉంటాయని రాజయ్య తరచుగా అంటుంటారు. ఇప్పుడు ఆయన మాదిగలను ఏకం చేసే కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్​ఘన్​పూర్​లో సోమవారం మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం పేరిట సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కడియంపై హాట్ కామెంట్స్ చేశారు. 

కడియంను గుంటనక్కతో పోల్చారు. ‘కుట్రలు చేసి కేసీఆర్ తొలి కేబినెట్​లో రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోయేలా చేసిండు.. ఎందుకు పదవి నుంచి తొలగించారో ఇప్పటికీ తెల్వదు.. ఇప్పుడు మళ్లీ కుట్ర చేసి పార్టీ టికెట్​ రాకుండా చేసిండు’ అని మందకృష్ణ ధ్వజమెత్తారు. మాదిగ బిడ్డ రాజయ్యకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో బీఆర్​ఎస్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.