ప్రగతిభవన్ కు స్టేషన్ ఘన్ పూర్ లొల్లి.. కేటీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ

ప్రగతిభవన్ కు స్టేషన్ ఘన్ పూర్ లొల్లి.. కేటీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ

ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే తాటికొండ పంచాయతీ ప్రగతిభవన్ కు చేరింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో తాటికొండను ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. ప్రగతిభవన్ కు రావాలని మంగళవారం ఉదయం (జులై 11న) స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు CMO ఆఫీసు నుంచి కాల్ రావడంతో హుటాహుటిన ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. 

గత కొంతకాలంగా కడియం, తాటికొండ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు వ్యక్తిగతంగానూ ఆరోపణలు సంధించుకున్నారు. వీరి మధ్య మాటల యుద్ధానికి ముఖ్యకారణం టిక్కెట్ విషయం. 

ఈ ఇద్దరు నేతలు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఇద్దరు నేతలకు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో ఈ ఇద్దరు నాయకులు ఎవరికి వారు సొంతంగా తమ బల ప్రదర్శన నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు, టికెట్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతకాలంగా కడియం, తాటికొండ తరచూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఆశిస్తున్నారు. తనకు టికెట్ వస్తుందో రాదోననే బెంగ ఎమ్మెల్యే తాటికొండను కొంతకాలంగా వెంటాడుతోంది. ఇటు కడియం కూడా టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే తాటికొండను ప్రగతిభవన్ కు పిలిపించుకుంది. తాటికొండ నుంచి వివరణ తీసుకుని.. ఆ తర్వాత కడియం శ్రీహరితోనూ మాట్లాడనున్నారు అధిష్టానం పెద్దలు.